Site icon HashtagU Telugu

Cyclone In AP : ఏపీకి తుపాను హెచ్చరిక‌… ఆ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్‌

Rains

Rains

వారాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అక్టోబరు నాటికి అల్పపీడనంగా బలపడి 22వ తేదీ ఉదయం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. గాలి మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సముద్ర తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. అయితే ఈ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారుతుందో లేదో అంచనా వేయలేమని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం తుపాను ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మరోవైపు మంగళవారం విజయవాడలో భారీ వర్షం కురిసి అత్యధికంగా కొయ్యూరు మండలం కాకరపాడులో 5.6, తాడేపల్లిగూడెంలో 5.6, సోమలో 5.4, విజయవాడలో 5.1, కంభం మండలం రావిపాడులో 5, రాజమహేంద్రవరంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Exit mobile version