Rains In AP : ఉత్త‌ర‌కోస్తాలో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం – వాతావ‌ర‌ణ శాఖ‌

కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 07:35 AM IST

కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తా వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కాగా భారీ వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి 9,35,465 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా దౌలేశ్వరం పత్తి బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 9.8 అడుగులకు చేరుకుంది. బ్యారేజీ నుంచి 7,26,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. డెల్టా కాల్వలకు 6వేల క్యూసెక్కుల నీటిని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.