Heavy Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ముఖ్యంగా రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. పిడుగుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read: MLC Kavitha : కవిత రాజీనామాను ఆమోదించని గుత్తా సుఖేందర్ రెడ్డి..నిజంగా కారణం అదేనా..?
తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సాయంత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని IMD సూచించింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు నిలిచిపోయే ప్రాంతాలను నివారించాలని సూచించింది. అవసరమైతే సహాయక చర్యల కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారు.
పిడుగులు పడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పిడుగులు పడేటప్పుడు పొలాల్లో, చెట్ల కింద ఉండవద్దు.
- ఎత్తైన ప్రదేశాల్లో, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దు.
- ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి.
- సురక్షితమైన ఆశ్రయం కోసం వెంటనే ఇళ్లలోకి వెళ్లాలి.
వర్షాల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి.
- వర్షపు నీటిలో నడవవద్దు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి.
- రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
- నీటిలో మునిగిన రోడ్లపై వాహనాలను నడపవద్దు.