Heavy Rains In AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయవ్య దిశగా గంటకు 10కి.మీ వేగంతో కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (Heavy Rains In AP) వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 440 కి.మీ, పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇది గురువారం తెల్లవారుజామున చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది.
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతంలోని ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో భారీ వర్షం నమోదు కానున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు కాలనీ వాసులను తరలించేందుకు 33 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.
Also Read: IND vs NZ: నేటి నుంచి భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం
కడప జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవు
కడప జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. సిద్ధవటం సమీపంలో పెన్నా నది భారీగా ప్రవాహిస్తుంది. పెన్నా నది పరివాహక ప్రదేశంలో అనుమతి లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
చెన్నైలో ఇప్పటికే బంద్
తమిళనాడులో భారీ వర్షాలు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల రోడ్లు, నివాస ప్రాంతాలు మోకాళ్లలోతు నీటితో మునిగి ఉన్నాయి. దీంతో పలు రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ముందుస్తు జాగ్రత్త చర్యగా చెన్నై, చెంగల్‌పేట, తిరువలూరు, కాంచీపురం జిల్లాల్లో బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.