AP Rains : ఏపీలో భారీ వ‌ర్షాలు…తీవ్ర ఇబ్బందుల్లో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - November 19, 2021 / 11:39 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన మంత్రి అనిల్ కుమార్ అక్కడి నుంచి ఫోన్ లో ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు.


ఇటు క‌డ‌ప జిల్లాలో భారీ వ‌ర్షాలకు జ‌నజీవ‌నం స్త‌భించిపోయింది. కడపజిల్లా నందలూరు మండలంలోని కొలత్తూరు లో చెయ్యేరు డ్యామ్ తెగిపోయింది. ఫించా డ్యాం నుండి ఉధృతంగా నీరు కిందకు రావడం తో తెల్లవారు ఝామున చెయ్యేరు డ్యాం కొట్టుకుపోయిన‌ట్లు స్థానికులు తెలిపారు. దీంతో పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునిగిపోయాయి. 30 ఏళ్ల నాటి చెయ్యేరు డ్యాం కొట్టుకుపోవ‌డంతో చుట్టుప్ర‌క్క‌ల ప్ర‌జ‌లు కొండ‌పైకి వెక్కి ప్రాణాల‌ను కాపాడుకుంటున్నారు.

LIVE UPDATES : ఘాట్ రోడ్డును క్లియర్ చేస్తున్న టీటీడీ సిబ్బంది

ఇటు తిరుమ‌ల‌లో కుండ‌పోత వ‌ర్షం కురుస్తుంది. తిరుమ‌ల‌కు వేళ్లే ఘాట్ రోడ్ల‌న్నీ వ‌ర‌ద నీటితో నిండిపోయాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఘాట్ రోడ్ల‌ను అధికారులు మూసివేశారు. ఘాట్ రోడ్లు తెరిచే సమయాన్ని తిరిగి తెలియ‌జేస్తామ‌ని టీటీడీ తెలిపింది. భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా అలిపిరి వ‌ద్ద కొండ‌పైకి ఎవ‌రిని అనుమ‌తించ‌డంలేదు. తిరుమలకు కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను నవంబరు 17, 18 తేదీల్లో మూసి వేయడం జరిగిందని.. ఈ రెండు నడకమార్గాలు నవంబర్ 19వ తేదీ కూడా మూసివేస్తున్న‌ట్లు టీటీడీ తెలిపింది.

భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు గత రాత్రే అధికారులు ఆయా జిల్లాలకు చేరుకున్నారు. భారీ వర్షాల వల్ల సంభవిస్తున్న వరదల నేపథ్యంలో సహాయ చర్యలను ఆ అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు. అలాగే వారు పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిస్తారు. నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, వైయస్సార్‌ జిల్లాకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌కుమార్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలపై కలెక్టర్ చక్రధర్ బాబుతో మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ఫోన్లో వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. వరదనీటితో పోటెత్తుతున్న సంగం ఆనకట్ట, సోమశిల ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. ఏ ఒక్కరి ప్రాణనష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను ఆదేశించారు. నెల్లూరు పట్టణంలోని పరిస్థితి సహా వెంకటగిరి, గూడూరు, ఉదయగిరి, ఆత్మకూరు , కావలి తదితర ప్రాంతాలలో పంటనష్టం గురించి వివరాలను మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎన్డిఆర్ఎఫ్ సహా భద్రతా బలగాలను పంపి రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాణాలు లెక్కచేయకుండా సెల్ఫీల కోసం వెళ్లే యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని క‌లెక్ట‌ర్ ను ఆదేశించారు. ఎగువన అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి సోమశిలకు వరద నీరు ఉద్ధృతంగా వస్తుండడంపై ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా సమీక్ష నిర్వహించాలని…వర్షం ప్రభావం తగ్గిన వెంటనే రైతులకు ఇబ్బంది కలగకుండా పంట నష్టాలపై అంచనా వేసేలా అధికారులు ఉపక్రమించే విధంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని కలెక్టర్ కి సూచించారు.