ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖపట్నం, నంద్యాల, ఏలూరు, ఎన్టీఆర్ సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ భారీ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఇతర జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో సగటున 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అల్పపీడనం ప్రభావం గురువారం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 10 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జాబితాలో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో రానున్న మూడు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు దూరంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.