Heavy Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని (Heavy Rains) వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందన్నారు. ఇది అల్పపీడనంగా మారి.. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఆదివారం అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అల్పపీడనం ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తమిళనాడుతో పాటు ఏపీలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు.
Also Read: TPCC President Mahesh Kumar: కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ!
ఏపీలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ముగిసిన వెంటనే 17వ తేదీన అండమాన్ దీవుల సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తేలింది. వరుసగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో తమిళనాడు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు అస్తవ్యస్థంగా మారుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వరి పంట చేతికొచ్చింది. రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నారు. అకాల వర్షాలు వస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు భయపడుతున్నారు. వర్షాలు కురిస్తే పంట మునిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు.