Site icon HashtagU Telugu

Heavy Rain: తెలంగాణ‌, ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

Heavy Rains

Heavy Rains

Heavy Rain: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి తీరం వైపు కదులుతున్నందున.. రాబోయే 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వైపు కదులుతున్న వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Also Read: Minister Lokesh: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ అభినందనలు

తెలంగాణలో వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడటంతో రాష్ట్రంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలాలు, మురుగునీటి పారుదల వ్యవస్థలను పర్యవేక్షిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. రైతులు తమ పంటలకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.