నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో బ్యారేజీ 25 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.
కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ఇప్పటికే కాల్వల ద్వారా ఖరీఫ్ సాగుకు కృష్ణా తూర్పు, పడమరలకు నీటిని విడుదల చేశారు.
మరోవైపు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ పరివాహక ప్రాంతంలో పశువులు, మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.