Site icon HashtagU Telugu

Viral Video : నిండు గర్భిణి ఏడు కిలోమీటర్లు డోలిలోనే.. వీడియో వైరల్

Pregnant Woman In Doli Alluri Sitharamaraju District Madugula

Viral Video : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా నేటికీ తెలుగు రాష్ట్రాల్లోని చాలా మారుమూల గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ సరిగ్గా లేదు. ఆయాచోట్ల సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో అత్యవసరాలు వచ్చినప్పుడల్లా ఆయా ప్రాంతాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. అవసరమైతే ఇతరత్రా రంగాలకు కేటాయింపుల్లో కోతలు పెట్టయినా సరే.. మారుమూల ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీని పెంచాలి. వాటికి అత్యంత చేరువలో అత్యుత్తమ వైద్యసేవలను అందుబాటులోకి తేవాలి. ఇక విషయంలోకి వెళితే..  అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గడుతురు పంచాయతీ శివారులోని పీవీటీజీ కొందు గిరిజన గ్రామానికి చెందిన పాంగి జ్యోతి (19)  నిండు గర్భిణి. ఆమెకు ఈరోజు తెల్లవారుజామున పురుటి నొప్పులు మొదలయ్యాయి.

Also Read :MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్‌.. రాజకీయ ఉత్కంఠ

పీవీటీజీ కొందు నుంచి సీత బందలు వరకు..

దీంతో ఆమెను డోలీలో పీవీటీజీ కొందు గ్రామం నుంచి సీత బందలు గ్రామం వరకు తీసుకెళ్లారు. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఆమెను డోలీలో మోసుకొని పోయారు. ఆమె భర్త చిక్కుడు శ్రీను, కుటుంబ సభ్యులు డోలీలో తీసుకొని వెళ్లారు. ఓ కర్రకు దుప్పట్లను కట్టి అందులో నిండు గర్భిణి పాంగి జ్యోతిని తీసుకెళ్లారు. ఇక సీత బందలు గ్రామం నుంచి అంబులెన్స్‌లో కొయ్యూరు మండలం డౌనూరు ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. డోలీలో గర్భిణిని తీసుకెళ్తున్న  వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాలు, వైద్య సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read :Tomato Prices : టమాటా ధరలు ఢమాల్.. రంగంలోకి చంద్రబాబు సర్కార్

బైక్ అంబులెన్సులు ఏవి ?

గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి మారుమూల గిరిజన గ్రామాలకు బైక్ అంబులెన్సులను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడవి పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయా పల్లెల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తే డోలీయే దిక్కవుతోంది. మారుమూల గిరిజన గ్రామాల పల్లెలను సమీపంలోని మండల కేంద్రాలను అనుసంధానించేలా ప్రత్యేక నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఏపీ అసెంబ్లీలో గిరిజన వర్గం ఎమ్మెల్యేలు గళం విప్పాలని ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు.