Health Minister : ఎ.కొండూరు కిడ్నీ బాధితుల‌కు సీఎం జ‌గ‌న్ అండ‌.. బాధితుల‌తో వైద్య‌ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని

ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప‌ర్య‌టించారు. ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో అండ‌గా..

  • Written By:
  • Updated On - November 20, 2022 / 08:06 AM IST

ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప‌ర్య‌టించారు. ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో అండ‌గా ఉండాల‌ని, కిడ్నీ రోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని, అవ‌స‌రాలు తీర్చాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌మ‌కు ఆదేశాలు జారీచేశార‌ని, ఆ మేర‌కు ఈ ప్రాంతం ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చామ‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని వెల్ల‌డించారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అందుతున్న వైద్య సేవ‌లు, ప్ర‌భుత్వం నుంచి అందుతున్న ఫ‌లాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో తెలుసుకునేందుకు మంత్రి విడ‌ద‌ల ర‌జినితోపాటు, వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు వ‌చ్చారు. తొలుత మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు ఎ.కొండూరు మండ‌లం మాన్ సింగ్ తండాకు వెళ్లారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో స‌మావేశ‌మ్యారు. కిడ్నీ రోగుల‌తో ప్ర‌త్య‌క్షంగా మాట్లాడారు. అనంత‌రం అక్క‌డి నుంచి దీప్లాన‌గ‌ర్‌కు వెళ్లారు. అక్క‌డి కిడ్నీ వ్యాధి బాధితుల‌తో మాట్లాడారు. స్థానిక స‌మ‌స్య‌ల‌పై అక్క‌డి వారితో చ‌ర్చించారు. ఆ త‌రువాత ఎ.కొండూరు పీహెచ్‌సీని సంద‌ర్శించారు. కిడ్నీ వ్యాధి రోగుల‌కు అక్క‌డ అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, వ్యాధి నిర్థార‌ణ‌ ప‌రిక‌రాలను ప‌రిశీలించారు. ఆయుష్ వైద్య‌శాల‌లో కొత్త‌గా ఏర్పాటుచేయ‌బోతున్న డ‌యాల‌సిస్ కేంద్రాన్ని త‌నిఖీచేశారు. ఈ సంద‌ర్భంగా అడుగ‌డుగునా సిబ్బందికి మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు. అనంత‌రం ఎం.కొండూరు మండ‌లంలోని వైద్య సిబ్బంది, పీహెచ్‌సీ సిబ్బంది అంద‌రితో క‌లిపి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్ర‌భావం చూపించ‌డానికి మంచినీటి స‌మ‌స్య కూడా ఒక కార‌ణంగా నివేదిక‌లు చెబుతున్నాయ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత మంచినీరు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌న్నారు. తాత్కాలికంగా వ్యాధి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ఐదు తండాల‌కు ట్యాంక‌ర్ల ద్వారా సుర‌క్షిత మంచినీటిని అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. మండ‌లంలోని అన్ని తండాల‌కు వారం రోజుల్లో ట్యాంక‌ర్ల ద్వారా మంచినీరు అందుతుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ప‌ది ట్యాంక‌ర్ల ద్వారా మంచినీటిని అందిస్తున్నార‌ని, ఇక‌పై 38 ట్యాంక‌ర్ల ద్వారా మంచినీరు స‌ర‌ఫరా అవుతుంద‌న్నారు. ఈ స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారం కోసం రెండు ప్రాజెక్టులు ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. ఒక‌టి కుద‌ప నుంచి రూ.6 కోట్ల నిధుల‌తో పైపు లైను ప‌నులు చేప‌ట్ట‌బోతున్నామ‌న్నారు. వ‌చ్చే ఏడు నెల‌ల్లో ఈ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మ‌రో ప్రాజెక్టులో భాగంగా మైల‌వ‌రం నుంచి రూ.38 కోట్ల‌తో పైపు లైను ప‌నులు చేప‌ట్ట‌బోతున్నామ‌న్నారు. ఈ ప్రాజెక్టు ఏడాదిన్న‌ర‌లోగా పూర్త‌వుతుంద‌ని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్త‌యితే ఎ.కొండూరు మండ‌లం మొత్తం ఇంటింటికి సుర‌క్షిత మంచినీరు స‌ర‌ఫ‌రా అవుతుంద‌న్నారు. అప్ప‌టివ‌ర‌కు తాత్కాలికంగా ట్యాంక‌ర్ల ద్వారా మంచినీటిని అందిస్తామ‌ని చెప్పారు. ఈ ప్రాంతంలోని అన్ని ఆర్వో ప్లాంట్ల‌ను విస్తృతంగా త‌నిఖీలు చేసి, సుర‌క్షిత మంచినీరు ప్ర‌జ‌ల‌కు అందేలా చేస్తున్నామ‌న్నారు.