Corruption Case: స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ కి మంద‌స్తు బెయిల్‌

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ‌కు హైకోర్టు మంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

  • Written By:
  • Publish Date - December 14, 2021 / 09:22 AM IST

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ‌కు హైకోర్టు మంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ స్టేట్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లో నిధుల దుర్వినియోగంపై సీఐడీ కేసు న‌మోదు చేసి ఆయ‌న ఇంట్లో సోదాలు నిర్వ‌హించింది. గత టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్ట‌ర్ గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు.
డిసెంబ‌ర్ 10వ తేదీన హైద‌రాబాద్ లోని ల‌క్ష్మీనారాయ‌ణ నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వ‌హించింది.అనంత‌రం డిసెంబ‌ర్ 13 న మంగ‌ళ‌గిరిలోని ప్రధాన కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ల‌క్ష్మీనారాయ‌ణ‌కు నోటీసులు అందించారు.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఒక ప్రాజెక్టు అమ‌లు చేయ‌డానికి రూ.242 కోట్లు దుర్వినియోగం అయ్యాయ‌ని సీఐడీ విచార‌ణ జ‌రుపుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ,సీఈవో ఘంటా సుబ్బారావుతో సహా 25 మందిపై కేసు న‌మోదు చేసింది. డిజైన్‌టెక్, సీమెన్స్ కంపెనీల‌కు ప్రాజెక్ట్‌లను వివిధ షెల్ కంపెనీల ద్వారా రూ. 242 కోట్లను మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. డిజైన్‌టెక్ సిస్టమ్స్ నుండి రూ. 242 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను సేకరించినట్లు ఎపిఎస్‌ఎస్‌డిసి పేర్కొంది. అయితే అలాంటి సాఫ్ట్‌వేర్ తమకు అందించలేదని విచారణలో తేలింది. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్ర‌స్తుత ఛైర్మ‌న్ అజ‌య్ రెడ్డి ఫిర్యాదు మేర‌కు సీఐడీ జులైలో ద‌ర్యాప్తును ప్రారంభించింది.

మరోవైపు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ సోమవారం కేసు నమోదు చేసింది. డిసెంబరు 10న హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ ఇంటికి సోదాలు జరుగుతున్న సమయంలో రాధాకృష్ణ మరికొంత మందితో కలిసి వచ్చి వారి విధుల‌కు అటంకం క‌లించార‌ని సీఐడీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఎఫ్‌ఐఆర్‌లో రాధాకృష్ణతో పాటు ఒక లాయర్, రిపోర్టర్, వీడియోగ్రాఫర్ పేర్లు ఉన్నాయి.