Site icon HashtagU Telugu

Stuartpuram : వెంటాడుతున్న “భూత”కాలం.. ప్రభుత్వ చేయూత కోసం స్టువర్ట్‌పురంలోని 6000 కుటుంబాల ఎదురుచూపులు!!

Stuvertapuram 4

Stuvertapuram 4

కాలం మారింది. చట్టాలు మారాయి. వారు ఉత్తమ పౌరులుగా పరివర్తన సాధించారు. అయితే వారి అభివృద్ధికి అవసరమైన చేయూత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఇది ఏపీలోని స్టువర్ట్‌పురం (Stuartpuram) కాలనీకి చెందిన ఎరుకుల సమాజంలోని 6,000 కుటుంబాల దీన స్థితి.క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 ప్రకారం.. వంద సంవత్సరాల క్రితం (1871లో) బ్రిటిష్ వారు వీళ్ళను ‘నేరస్థ తెగ’ సభ్యులుగా పరిగణించి.. ఇక్కడ ఒక ప్రత్యేక కాలనీ నిర్మించారు. 70 ఏళ్ల క్రితమే (1952లో) స్టువర్ట్‌పురం ఎరుకలపై ఉన్న ‘నేరస్థ తెగ’ అనే ముద్రను తొలగించారు. అయినా వారి జీవితాల్లో నేటికీ ఎలాంటి ఎదుగుదల లేదు. దిగువ మధ్య తరగతి వర్గంలోనే చాలామంది స్టువర్ట్‌పురం ఎరుకలు జీవితాలు వెల్లదీస్తున్నారు. దీనిపై ఒక ఫోకస్..

రిక్షా పుల్లర్‌ దీనావస్థ..

ఉదాహరణకు..స్టువర్ట్‌పురానికి చెందిన రిక్షా పుల్లర్‌ కర్రెద్దుల నాగేశ్వరరావు.. గతంలో తాను మారక ముందు 70 దొంగతనం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 1984లో అతడు పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే
ఆయన కలప డిపోను ప్రారంభించాలనుకున్నాడు. అందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఆశించినా ..అది కుదరలేదు. పునరావాస ప్యాకేజీలో భాగంగా ఆయనకు స్టూవర్టు పురంలో 70 సెంట్ల సాగు భూమి (70 సెంట్లు = 0.70 ఎకరాలు), ఇంటి కోసం 200 గజాలు కౌలుకు ఇచ్చారు. అయితే అనేక కారణాల వల్ల వ్యవసాయం లాభసాటిగా జరగలేదు. దీంతో కర్రెద్దుల నాగేశ్వరరావు తన కూతురి పెళ్లికి డబ్బు రెడీ చేయడానికి భూమిని అమ్మవలసి వచ్చింది.

ఎత్తుపల్లాల చరిత్ర

1910 నుండి స్టువర్ట్‌పురం ఎరుకుల తెగ సభ్యులకు పునరావాస కాలనీగా ఉంది. అప్పటి మద్రాసు ప్రభుత్వ హోమ్ మెంబర్ హెరాల్డ్ స్టువర్ట్ స్టువర్ట్‌పురం పునరావాస కాలనీలోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు.
ఈక్రమంలోనే వ్యవసాయం మరియు ఉపాధి కోసం వారికి భూమిని అందించారు.ఇండియన్ లీఫ్ టొబాకో కంపెనీలో జాబ్స్ ఇచ్చారు. గిరిజన సంక్షేమం కోసం ఆనాడు స్థాపించబడిన 11 ఆవాసాలలో
స్టువర్ట్‌పురం కాలనీ ఒకటి. ఈ జాబితాలో పాత గుంటూరు (Old Guntur) జిల్లాలోని సీతానగరం, నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట,(Bitragunta) దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని అజీజ్ నగర్‌ కూడా ఉన్నాయి.స్టువర్ట్‌పురం ప్రవేశద్వారం వద్ద హెరాల్డ్ స్టువర్ట్, సామాజిక కార్యకర్త హేమలత లవణం పేర్లను కలిగి ఉన్న ఒక ఆర్చ్ ఉంది. వీరిద్దరూ ఇక్కడి ప్రజల్లో పరివర్తన కోసం కృషి చేశారు. బ్రిటీష్ వారి కాలంలో స్టువర్ట్‌పురంలో ఒక ప్రాథమిక పాఠశాల స్థాపించబడింది. అది తరువాత ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయబడింది. స్టువర్ట్‌పురానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల మరియు బాపట్లలో ఇంటర్మీడియట్ , డిగ్రీ కళాశాలల సముదాయం వచ్చింది.

సక్సెస్ స్టోరీస్..

స్టువర్ట్‌పురం నుండి మొదటి ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా చిత్తూరి కోటేశ్వరరావు (Chittori Koteswara Rao) అయ్యారు.అనంతర కాలంలో చిత్తూరి కుటుంబం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిని, అలాగే ఇండియన్ ఫారిన్ ట్రేడ్ అధికారిని కూడా తయారు చేసింది. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన దివంగత కర్రెద్దుల కమల కుమారి కూడా ఈ కాలనీకి చెందినవారే.

మొగిలి మధు దీనగాధ..

స్టువర్టుపురం నివాసి మొగిలి మధు మాట్లాడుతూ, “మా పూర్వీకుల నుండి సంక్రమించిన కళంకం ఇప్పటికీ మా జీవితాలను దుర్భరంగా మారుస్తుంది. నేను ద్విచక్ర వాహనం కోసం రుణం కోరుకున్నాను. కానీ నేను స్టువర్ట్‌పురం నివాసి అయినందున ప్రైవేట్ ఫైనాన్షియర్ రుణాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు” అని చెప్పారు. “నేను జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడాను. అయితే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం సాధించలేకపోయాను” అని మధు చెప్పాడు.  చివరకు ఇతను పోలీస్ సర్వీస్ లో హోంగార్డుగా చేరాడు. “అయితే మా కాలనీకి ఉన్న ఖ్యాతి కారణంగా సీనియర్ పోలీసు అధికారులు నన్ను అణిచివేసేందుకు ప్రయత్నించినందున ..నేను ఉద్యోగానికి రాజనామా చేయవలసి వచ్చింది” అని మధు వివరించారు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు.

రెడ్ మార్క్ వల్ల లోన్స్ రావట్లేదు..

స్టూవర్టుపురం వెలుపలి ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ వంటి చిన్న చిన్న నేరాలు జరిగినా.. పోలీసులు ముందుగా స్టువర్టుపురంలో సోదాలు చేస్తారని మండల పరిషత్ అధ్యక్షుడు, స్టూవర్టుపురం వాసి మొగిలి హరిబాబు తెలిపారు. “ఆర్థిక సంస్థలు ఏదైనా స్టువర్ట్‌పురం చిరునామాను ఎరుపు సిరాతో అండర్‌లైన్ చేయడం కారణంగా మాకు రుణాలు రావడం లేదు” అన్నారాయన.

కామన్వెల్త్ గేమ్స్‌లో వెంకట్ రాహుల్ “డబుల్” ధమాకా

కబడ్డీ క్రీడాకారుడు, వెయిట్-లిఫ్టింగ్ ఛాంపియన్‌గా 14 పతకాలను సాధించిన మధు రాగల, మొగిలి మధు లాగే నిరాశకు గురయ్యాడు. తన ఇద్దరు కుమారులను స్పోర్ట్స్ ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దాడు .
వెయిట్-లిఫ్టింగ్ ఛాంపియన్ అయిన అతని పెద్ద కుమారుడు వెంకట్ రాహుల్ ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. వెంకట రాహుల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.మధు రాగల
చిన్న కుమారుడు వరుణ్ కూడా వెయిట్-లిఫ్టర్, ఆసియా క్రీడలలో పాల్గొన్నాడు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వరుణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఏమీ చేయలేదని మధు రాగల ఆవేదన వ్యక్తం చేశారు.