Power Scam in AP? : ఏపీ ‘ప‌వ‌ర్’ గోల్ మాల్

`రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధ‌కారం అవుతుంది. విద్యుత్ కొర‌త‌ను అధిగ‌మించ‌లేక మ‌ళ్లీ క‌లిసుందాం అంటూ తెలంగాణ వాళ్లు వ‌స్తారని ఉమ్మ‌డి రాష్ట్రానికి చివ‌రి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట‌లు, ఆయ‌నే కాదు, అనేక మంది లీడ‌ర్లు ఆనాడు అదే మాట చెప్పారు.

  • Written By:
  • Updated On - February 5, 2022 / 02:10 PM IST

`రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధ‌కారం అవుతుంది. విద్యుత్ కొర‌త‌ను  అధిగ‌మించ‌లేక మ‌ళ్లీ క‌లిసుందాం అంటూ తెలంగాణ వాళ్లు వ‌స్తారని ఉమ్మ‌డి రాష్ట్రానికి చివ‌రి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట‌లు, ఆయ‌నే కాదు, అనేక మంది లీడ‌ర్లు ఆనాడు అదే మాట చెప్పారు. వాళ్లు చెప్పిన విధంగానే విద్యుత్ లోటుతో తెలంగాణ ఏర్పడింది. మిగులు విద్యుత్ తో ఏపీ 2014లో వెలిగిపోయింది. సీన్ కట్ చేస్తే..2016 నుంచి తెలంగాణ నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రాతో వెలిగిపోతోంది. ఏపీ అంధ‌కారంలోకి వెళుతోంది. క‌రెంట్ కోత‌ల‌తో ఏపీ గ్రామాలు ఉన్నాయి.(Power Cuts In Andhra Pradesh) డిస్కంల‌కు విద్యుత్ బ‌కాయిల‌ను చెల్లించ‌లేక ఏపీ చేతులెత్తేసింది.ఇలా ఎందుకు జ‌రిగింద‌ని ఒక్క‌సారి ఆలోచిస్తే…అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను స‌క్ర‌మంగా ఉప‌యోగించుకోలేని ప‌రిస్థితుల్లో ఏపీ ఉంది. కేంద్ర విద్యుత్ త‌యారీ సంస్థ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లింపులు చేయ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. బొగ్గు కొనుగోలు చేయ‌లేని ప‌రిస్థితుల్లో థ‌ర్మ‌ల్ కేంద్రాల‌ను సామ‌ర్థ్యం మేర‌కు వాడుకోలేక‌పోతున్నామ‌ని సంకేతం ఏపీ స‌ర్కార్ ఇస్తోంది. దేశ వ్యాప్తంగా మారుతోన్న సోలార్‌లాంటి గ్రీన్ ఎన‌ర్జీ వైపు అడుగులు వేయ‌లేక త‌డ‌బ‌డుతోంది. రాష్ట్రం విడిపోయిన తొలి రోజుల్లో (2014 నాడు) ఇత‌ర రాష్ట్రాల‌కు విద్యుత్ ను ఏపీ స‌ర్కార్ విక్ర‌యించేది. ఆనాడు ఏపీలో నిరంత‌రం విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేది. వ్య‌వ‌సాయ దారుల‌కు ఏడు గంట‌ల ఉచిత విద్యుత్ టైం టూ టైం అందిచేది. ఇప్పుడు గ‌త‌ వారం రోజులుగా అన‌ధికార విద్యుత్ కోత‌ల‌ను ఏపీలో విధించారు.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) డిస్కం(Discom) ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాను ఆపివేసింది. ప్ర‌స్తుతం ఉన్న రూ. 350 కోట్ల బ‌కాయిల‌ను చెల్లించాల‌ని ఒత్తిడి పెడుతోంది. అంతేకాదు, బ‌కాయిలు చెల్లించ‌కుండా ఇత‌ర చోట్ల విద్యుత్ కొనుగోలు చేయ‌డానికి లేకుండా చేసింది. ఎన్టీపీసీ నుంచి అందాల్సిన 2 వేల మెగావాట్ల విద్యుత్ నిలిచిపోవ‌డంతో ప్ర‌త్యామ్నాయం వైపు జ‌గ‌న్ స‌ర్కార్ అన్వేష‌ణ ప్రారంభించింది. ఈస్ట్ర‌న్, స‌ద‌ర్ డిస్కంలు చెల్లించాల్సిన బ‌కాయిలు పెరిగిపోయాయి. ప‌లుమార్లు నోటీసులు ఇచ్చిన‌ప్ప‌టికీ డిస్కంల నుంచి రిప్లైయ్ లేదు.ఎన్టీపీసీ నిలిపివేసిన విద్యుత్ కు ప్ర‌త్యామ్నాయంగా రాయ‌లసీమ‌ థర్మల్ పవర్ ప్రాజెక్టు (RTPC) సామ‌ర్థ్యాన్ని పెంచ‌డం ద్వారా ఆ గ్యాప్ ను భ‌ర్తీ చేయాల‌ని ఏపీ స‌ర్కార్ ఆదేశాల‌ను జారీ చేసింది. మరో యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలని అనుకుంటున్న‌ప్ప‌టికీ త‌గిన బొగ్గు నిల్వలు లేక‌పోవ‌డంతో ఆర్‌టీపీపీ కూడా చేతులెత్తేసింది. ఇక కృష్ణపట్నం యూనిట్‌లో సాంకేతిక సమస్య కారణంగా 810 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇంకా కేవ‌లం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అక్క‌డ కూడా ఉన్నాయ‌ని అధికారులు స‌ర్కార్ కు నివేదించారు.వాస్తవంగా రాష్ట్రంలోని డిస్కమ్‌లు(Eastern, Southern Discom ) 2022-23 ఆర్థిక సంవత్సరానికి 66,530 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించవచ్చని జ‌న‌వ‌రి స‌మావేశంలో ఏపీఈఆర్సీ అంచనా వేసింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సేవలకు విద్యుత్ డిమాండ్ దాదాపు 19 లక్షల క‌నెక్ష‌న్ల‌కు 9,819 MU అవ‌స‌రం. పారిశ్రామిక‌, గృహ వినియోగానికి 38,199 మిలియ‌న్ యూనిట్లు అవ‌స‌ర‌మ‌ని లెక్కించింది. ఈ రెండు విభాగాల్లో 1.52కోట్ల మంది వినియోగ‌దారులు ఉన్నార‌ని తేల్చారు. మొత్తం ఏపీలోని 1.91 మంది విద్యుత్ వినియోగ‌దారుల్లో పారిశ్రామిక‌, గృహ వినియోగ‌దారుల వాట 80శాతం ఉంది. ఆర్థికంగా, ఆరోగ్య‌క‌ర‌మైన డిస్క‌మ్ ల‌ను త‌యారు చేయ‌డానికి అనుకూల‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఏపీఈఆర్సీ చైర్మ‌న్ సీవీ నాగార్జున రెడ్డి ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రిగిన మీటింగ్‌లో వెల్ల‌డించాడు.

ఎన్టీపీసీ నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోచిపోవ‌డంతో వీటీపీఎస్, ఆర్టీపీపీఎస్, క‌ష్ణ‌ప‌ట్నం థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల ద్వారా భ‌ర్తీ చేయాల‌ని స‌ర్కార్ తంటాలు ప‌డుతోంది. ఆ మూడు పూర్తి స్తాయిలో ప‌నిచేసే సుమారు 1700 మోగా వాట్లు విద్యుత్ ను ఉత్ప‌త్తి చేయ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ, బొగ్గు నిల్వ‌లు కొర‌త ఉండ‌డంతో చేతులెత్తేయ‌డం మిన‌హా మ‌రో మార్గం జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ద్ద లేద‌ని విద్యుత్ నిపుణులు చెబుతున్నారు.ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వేసిన అంచ‌నా ప్ర‌కారం దాదాపు రూ. 1,000 కోట్ల విలువైన కనీసం 1700 మిలియన్ యూనిట్ల (MU) శక్తిని ఆదా చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన అవకాశం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు) ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు, సాధారణ ప్రజల మద్దతుతో పాటు కీలక రంగాలలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా ఈ ఆదా సాధ్య‌మ‌ని AP స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ చంద్రశేఖర రెడ్డి ఆనాడు చెప్పాడు. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్-2021లో భాగంగా వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో(VR Siddhartha Engineering College) జరిగిన సభలో ఆ మేర‌కు ఆయన వెల్ల‌డించాడు. ఇదంతా రెండు నెల‌ల క్రితం జ‌రిగిన ముచ్చ‌ట‌. ఇప్పుడు ప‌రిస్థితి రివర్స్ లో ఉంది.విద్యుత్ కొనుగోలు, అమ్మకాల స‌మ‌యంలో జ‌రుగుతోన్న గోలుమాల్ వ్య‌వ‌హారంపై చాలా సంద‌ర్భాల్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. పైగా ఏపీకి చెందిన ఒక మంత్రి స‌మీప బంధువు బొగ్గు గ‌నుల కాంట్రాక్టులో ఉన్నాడు. ఓపెన్ కాస్ట్ బొగ్గు మైనింగ్ లో ఆయ‌న దిట్ట‌. కొన్ని వేల కోట్ల రూపాయాల బొగ్గు కాంట్రాక్టు ను న‌డుపుతున్నాడు. తెలంగాణ ప్ర‌భుత్వంతోనూ ఆయ‌న స‌న్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడు. ఏపీలోని ఒక మంత్రి ద్వారా ఈ వ్య‌వ‌హారాన్ని ఆ కాంట్రాక్ట‌ర్ ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని న‌డుపుతున్నాడ‌ని థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ వ‌ర్గాల వినికిడి. హైడ‌ల్‌, సోలార్‌, గ్యాస్ ద్వారా ఉత్ప‌త్తి అయ్యే ప‌వ‌ర్ ను కాద‌ని ప‌లు సంద‌ర్భాల్లో థ‌ర్మ‌ల్ యూనిట్ల‌కు బొగ్గును ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసేలా కృత్రిమ డిమాండ్ ను తీసుకొస్తున్నార‌ని కూడా స‌ర్వ‌త్రా ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.ప్ర‌స్తుతం బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivas Reddy) ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయ‌న సీఎం జ‌గ‌న్ కు స‌మీప బంధువు. గ‌త ఏడాది కూడా ఇలాగే విద్యుత్ కొర‌త ఏపీలో ఏర్ప‌డింది. ఆ సంద‌ర్భంగా బొగ్గును ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి కొర‌త‌ను నివారించారు.

ఇప్పుడు ఎన్టీపీసీ(NTPC)కి రూ. 350కోట్ల బ‌కాయిల‌ను చెల్లించ‌లేమంటూ..వీటీపీఎస్(VTPS), ఆర్టీపీపీఎస్(RTPS), క‌ష్ణ‌ప‌ట్నం థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల‌కు(Krishnapatnam Thermal Power Project) ఎక్కువ ధ‌ర‌కు బొగ్గు కొనుగోలు చేయడానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బొగ్గు నిల్వ‌లు ఆ మూడు కేంద్రాల్లో త‌క్కువ‌గా ఉన్నాయి. పూర్తి సామ‌ర్థ్యం మేర‌కు వాటిని న‌డ‌పాలంటే, బొగ్గును అత్య‌ధిక ధ‌ర‌కైనా కొనుగోలు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. సోలార్‌, హైడ‌ల్ ప‌వ‌ర్ అన్నింటి కంటే త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంది. ఎన్టీపీసీకి రూ. 350 కోట్ల బ‌కాయిల‌ను చెల్లించ‌లేక ఏపీ స‌ర్కార్ ఉందా? లేక బొగ్గును ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌డం ద్వారా కాంట్రాక్ట‌ర్ కు ల‌బ్ది చేకూర్చే ఆలోచ‌న‌లో ఉందా? అనేది విప‌క్షాలు వేస్తోన్న ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే గ్రామాల‌ను అంధ‌కారంలోకి నెట్టేసిన జ‌గ‌న్ స‌ర్కార్ విప‌క్షాల ప్ర‌శ్న‌పై ఎలా స్పందిస్తుందో..చూద్దాం.!ఇదే విష‌యంపై ఏపీఈఆర్సీకి చెందిన ఒక ఉన్న‌తాధికారిని హాష్ ట్యాగ్ దృష్టికి తీసుకెళ్ల‌గా..బొగ్గు ధ‌ర‌లు అప్పటిక‌ప్పుడు పెంచి కొనుగోలు చేయ‌డం ఉండ‌ద‌న్నాడు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఎన్టీపీసీకి బ‌కాయిలు చెల్లించ‌లేక‌పోయి ఉండొచ్చ‌ని తెలిపాడు. తెలంగాణ నుంచి ఇంకా సుమారు రూ. 6వేల కోట్ల బ‌కాయిలు రావాల‌ని అన్నాడు. త్వ‌ర‌లో అంతా చ‌క్క‌బ‌డుతుంద‌ని ఎప్ప‌టిలాగే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ వ‌స్తుందని చెబుతూ ప్ర‌స్తుతం వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేశాడు.