Site icon HashtagU Telugu

Chandrababu On Tickets To Youth : మోసం సారూ.!

CBN Vision 2024

Chandrababu

`ఏపీ పున‌ర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తెలుగు వాళ్ల‌ను, టీడీపీని ఎవ‌రూ విడ‌దీయ‌లేరు. కార్య‌క‌ర్త‌ల త్యాగం మ‌ర‌వ‌లేనిది. యువ‌త‌కు 40శాతం సీట్లు ఈసారి ఇస్తాను. వ‌చ్చే 40ఏళ్ల‌కు స‌రిప‌డా నాయ‌క‌త్వాన్ని త‌యారు చేస్తా..` ఇదీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు 40ఏళ్ల టీడీపీ ఆవిర్భావ వేడుక‌ల్లో చేసిన ప్ర‌సంగంలోని హైలెట్ పాయింట్లు. లేటెస్ట్ త‌రానికి ఆ మాట‌లు కొత్త‌గా అనిపించొచ్చు. పాత‌, మ‌ధ్య త‌రానికి మాత్రం పాత స్టేట్ మెంట్లే క‌దా..అనే విష‌యం స్పుర‌ణ‌కు వ‌స్తుంది. ఆ పార్టీ మంచికోరుకునే వాళ్లు బాబు చేసిన 40శాతం యూత్ కోటా వెనుక ర‌హ‌స్యాన్ని గ‌మ‌నించాలి.మొత్తం ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 40శాతం అంటే సుమారు 55 సీట్లు యూత్ కు వ‌స్తాయ‌నుకోండి. వాటిలో నాయ‌క‌త్వ ప‌టిమ ఉన్న కొత్త వాళ్ల‌కు ఎన్ని ఇస్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌. కుటుంబ వార‌స‌త్వం పుష్క‌లంగా ఉన్న టీడీపీలో 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా మూడు డ‌జ‌న్ల‌కు పైగా వార‌సులు అభ్య‌ర్థిత్వాల‌ను పొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1983 నుంచి అవే పాత మొఖాలు. లేదంటే వాళ్ల కుటుంబీకులు, పిల్ల‌లు. ఇంత‌కు మిన‌హా కొత్త వాళ్ల‌కు ఇచ్చిన అవ‌కాశం నేతిబీర‌కాయ‌లో నెయ్యి సామెతే. సీనియ‌ర్ల వాళ్ల పిల్ల‌ల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ఒక రాజ‌కీయ వేదిక‌గా టీడీపీని వాడుకుంటున్నారు. వ్యాపారాన్ని, ఆస్తుల‌ను వార‌స‌త్వంగా ఇచ్చిన‌ట్టు రాజ‌కీయాన్ని వార‌సుల‌కు సీనియ‌ర్లు అప్ప‌గిస్తున్నారు. దాదాపు 30 మందికిపైగా 2019 ఎన్నిక‌ల్లోనే వార‌సులు దిగారు. వాళ్ల‌ను కాద‌ని ఈసారి ఎన్నిక‌ల్లో కూడా టిక్కెట్లు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు ధైర్యం చేయ‌డు. వాళ్ల‌తో పాటు ఈసారి మ‌రో 20 మంది వ‌ర‌కు సీనియ‌ర్ల పిల్ల‌లు అభ్య‌ర్థిత్వాల‌ను ఆశిస్తున్నారు. మొత్తంగా 50 సీట్లు వార‌సుల‌కు ఇవ్వ‌డానికి యూత్ 40శాతం కోటా అంటూ బాబు మ‌భ్య‌పెడుతున్నాడ‌ని ప్ర‌త్య‌ర్థులే కాదు..సొంత పార్టీలో చిర‌కాలంగా జెండాను మోస్తున్న క్యాడ‌ర్ లోనూ వినిపిస్తోంది.

2019 ఎన్నిక‌ల్లో బరిలోకి దిగిన టీడీపీ సీనియ‌ర్ల వార‌సులు జ‌గ‌న్ దెబ్బ‌కు చాలా మంది ఓడిపోయారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు, మంత్రి పరిటాల సునీత శ్రీరాం, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ కుమార్తె శిరీష, జలీల్‌ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్‌, మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌, స్వ‌ర్గీయ‌ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భానుప్రకాష్‌, మాజీ మంత్రి కిమిడి మృణాళినికుమారుడు నాగార్జున, స్వ‌ర్గీయ దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌, స్వ‌ర్గీయ ఎర్రన్నాయుడు కుమార్తె భవాని త‌దిత‌రుల‌కు 2019 ఎన్నిక‌ల్లో తొలి జాబితాలోనే టిక్కెట్లు ఇచ్చింది. వాళ్లంతా టీడీపీ సీనియ‌ర్ల పిల్ల‌లు, కుటుంబీకులే. పత్తికొండ- కేఈ శ్యాంబాబు,రాప్తాడు-పరిటాల శ్రీరాం ,శ్రీకాళహస్తి- సుధీర్ రెడ్డి, పలాస-గౌతు శిరీష, విజయవాడ (వెస్ట్)- షబానా ఖాతూన్ ,అర‌కు- కిడారి శ్రావణ్‌, చీపురపల్లి- నాగార్జున , గుడివాడ- దేవినేని అవినాశ్‌, రాజమండి- ఆదిరెడ్డి భవాని ఆనాడు పోటీకి దిగారు.

ఆ క్ర‌మంలోనే ఆలూరు స‌హా.. క‌ర్నూలు నుంచి కోట్ల కుటుంబం గత ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసింది. ఆలూరు నుంచి సుజాత‌మ్మ‌, క‌ర్నూలు ఎంపీ టికెట్ నుంచి సూర్య ప్ర‌కాశ్‌లు పోటీ చేశారు. చిత్తూరు జిల్లాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు. గత ఎన్నికల్లో కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పెడన బరిలో దిగిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కూడా మరొకసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పామర్రు సీటు సీనియర్ నేత వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజాకు దక్కిన విషయం తెలిసిందే. అటు ఎంపీ కేశినేని నాని తనయురాలు కేశినేని శ్వేత..విజయవాడ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ సైతం ఎన్నికల బరిలో దిగడానికి సిద్దమవుతున్నాడు. అవనిగడ్డలో టీడీపీ బాధ్యతలు వెంకట్రామ్ చూసుకుంటున్నాడు. ఇలా కృష్ణా జిల్లా నుంచి పలువురు నేతల వారసులు ఎంట్రీ ఇచ్చారు.

దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుండి మరోసారి ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడ రామ్మోహన్ నాయుడు పోటీ చేసి నెగ్గారు. ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవానీ కూడ రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు.మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు. పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్‌లు తొలిసారి ఎమ్మెల్యేగా, ఎంపీ స్థానాలకు పోటీ చేశారు. ప్ర‌స్తుతం టీడీపీలో 1983 బ్యాచ్ కు చెందిన సీనియ‌ర్ల పిల్ల‌లు వార‌సులుగా 2019లో 30 మందికి పైగా ఎంట్రీ ఇవ్వ‌గా, ఈసారి మ‌రో 20 మందికిపైగా పోటీ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. ఆ జాబితాలోనారా. లోకేష్‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు ద‌గ్గుబాటి హితేష్ కూడా ఉన్నారు. ఇలా లెక్కించుకుంటూ వెళితే, 70 మందికి పైగా వార‌సులు టీడీపీ నుంచి ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇక యూత్ కోటా అంటూ చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించ‌డం టీడీపీ మంచికోరుకునే వాళ్ల‌కు ఏ మాత్రం రుచించ‌డంలేదు. ఆయ‌న చెప్పిన పెద్ద అబ‌ద్ధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిలిచిపోనుంది. వ‌చ్చే 40 ఏళ్ల‌కు టీమ్ ను సిద్ధం చేస్తున్నానంటూ చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం కొత్త వాళ్లు నీర‌స‌ప‌డేలా చేసింది. యూత్ కు 40శాతం టిక్కెట్ల ఇస్తాన‌ని 2009 ఎన్నిక‌ల నుంచి చంద్ర‌బాబు చెబుతున్నాడు. మ‌హిళ‌ల‌కు 33శాతం మించేలా టిక్కెట్ల ఇస్తాన‌ని చెప్పిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. కానీ, ఏ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న చెప్పిన విధంగా టిక్కెట్లు కేటాయించిన దాఖ‌లాలు లేవు. ఈసారి కూడా పొత్తుకు పోగా మిగిలిన సీట్ల‌లో వార‌సుల‌తోనే నిండిపోతాయ‌ని టీడీపీలోని వాళ్ల‌కు తెలియ‌ని అంశం కాదు. కానీ, చంద్ర‌బాబు కొత్త‌గా ఏదో ప్ర‌క‌టించ‌డాని చెప్పుకోవ‌డం భ‌స్మాసుర హ‌స్తం సామెత‌లా ఉందన‌డంలో సందేహం లేదు.