Site icon HashtagU Telugu

Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

Kurnool Road Accident

Kurnool Road Accident

కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో దాదాపు 20మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు రియల్ హీరోస్ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన హరీష్ కుమార్రాజు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహారించి పది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.

హరీష్కుమార్ రాజు సొంత పని మీద కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని కారులో.. తన స్నేహితులు మణిదీప్, వంశీ, జ్ఞానేశ్లతో కలిసి బెంగళూరు బయల్దేరారు. అర్ధరాత్రి దాటాక చిన్నటేకూరు దగ్గర రోడ్డుపై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు రావడాన్ని గమనించారు. వెంటనే తన కారును ఆపి, కుడివైపు బస్సు అద్దాన్ని పగులగొట్టి, లోపల ఉన్న పది మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బస్సు పేలిపోయి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిలో ఆరుగురికి గాయాలయ్యాయి.. వారిని హరీష్ తన స్నేహితుల సహాయంతో వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో హరీష్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టాయి.

మరోవైపు హిందూపురం కారు డ్రైవర్ నవీన్ కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. నంద్యాలకు వెళ్తుండగా దారిలో చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదాన్ని చూశారు. మంటలు ఎక్కువగా ఉండటంతో వెంటనే స్పందించి, ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. బస్సులోంచి కొందరు బయటపడినా, ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆరుగురిని తన కారులో కర్నూలు సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ వారికి సరైన వైద్యం అందేలా చూసి, వారి ప్రాణాలను కాపాడారు. ఆయన చూపిన మానవత్వానికి అందరూ మెచ్చుకున్నారు.

బెంగుళూరుకు చెందిన ముగ్గురు యువకులు, ఒక బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి జయంత్ (సీటు నెం యు7), ఆకాశ్ (సీటు యూ3), అశ్విన్ (సీటు ఎల్1) ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే, వారికి భయం వేసింది. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. వారు ధైర్యంగా వ్యవహరించారు. మొదట్లో అది పగలలేదు. కానీ వారు గట్టిగా ప్రయత్నించి, చివరికి అద్దాన్ని పగులగొట్టారు. అయితే, అద్దం పగిలిన తర్వాత కూడా బయట ఇనుప కడ్డీలు (ఐరన్ గిల్స్) ఉన్నాయి. ఆ కడ్డీల మధ్య సందులు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఆ సందుల గుండా బయటకు రావడం చాలా కష్టమైన పని. అయినా ఇరుకైన సందుల గుండా బయటపడ్డారు. ఆ ముగ్గురు యువకులు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు.

Exit mobile version