Site icon HashtagU Telugu

AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం

Harirama Jogaiah Wrote Lett

Harirama Jogaiah Wrote Lett

డా. ప్రసాదమూర్తి

మనకు ఒక సామెత ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని. ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనతో రాజకీయ పొత్తుకు సిద్ధమైనా, ఎన్నికలలో సీట్ల ఒప్పందం విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగలేదు. ఒకపక్క అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ విడతల వారీగా సమావేశాలు జరుపుతున్నారు. చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరచాల్సిన కీలకమైన అంశాలు, రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎవరు ఎక్కడెక్కడ ఏఏ స్థానాల్లో పోటీ చేయాలి.. ఇలా అనేక విషయాల మీద ఇరు పార్టీల అగ్ర నాయకులు అనేక దఫాలుగా సమావేశమై చర్చలు సాగిస్తున్నారు. ఈ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తెలుగుదేశం పార్టీ జనసేనకు ఎన్ని స్థానాలను కేటాయిస్తుంది అనే విషయం ఇంకా ఖరారు కాలేదు. ఇంతలోనే చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు ఒక లేఖ రాశారు. అందులో పవన్ కళ్యాణ్ పోటీ చేసే మూడు స్థానాలు.. తిరుపతి, భీమవరం, నరసాపురం అని, వాటిలో ఎక్కడి నుంచైనా పవన్ పోటీ చేయొచ్చని, దీనితో పాటు 50 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయాలని, ఏ ఏ స్థానంలో ఏ ఏ అభ్యర్థి పోటీ చేయాలో కూడా హరి రామ జోగయ్య తమ లేఖలో స్పష్టంగా రాసినట్టు వార్త వైరల్ అయింది. ఇప్పుడు ఈ లేఖ మీద తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం వర్గాలలో తీవ్ర అసంతృప్తులు కూడా రగులుతున్నాయి.

ఇప్పటిదాకా ఇరు పార్టీల అంచనాల మేరకు జనసేనకు పాతిక నుంచి 30 స్థానాలు కేటాయించవచ్చునని, మూడు ఎంపీ స్థానాలను ఇవ్వవచ్చునని వినవస్తోంది. అయితే సీఎం పదవి విషయంలో ఇంతవరకు ఎక్కడా పవన్ కళ్యాణ్ పెదవి విప్పలేదు. ఆయన అభిమానులు చాలామంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకపోతే తమ సామాజిక వర్గం అంతా ఓట్లు వేసి తెలుగుదేశం వారిని గెలిపిస్తే తమకు లాభం ఏంటని చేస్తున్న ఒక వాదన ఎప్పటినుంచో వినవస్తోంది. ఈ వాదన నేపథ్యంలో ఇప్పుడు హరి రామ జోగయ్య నేరుగా పవన్ కళ్యాణ్ సీఎం పదవిని షేర్ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇది మరో కొత్త వివాదం సృష్టించింది. ఇప్పటికే చాలాసార్లు పవన్ కళ్యాణ్ మన బలం.. మన శక్తి ఏమిటో తెలుసుకొని మనం అడుగులు వేయాలని చాలాసార్లు తన కార్యకర్తలకు ఉపదేశించారు. ఆ ఉపదేశాలు ఏమీ వారి చెవికి ఎక్కినట్టుగా లేదు. పవన్ కళ్యాణ్ సీఎం పదవిని పంచుకోకపోతే కాపు ఓట్లు, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి సరఫరా కాకపోవచ్చునని ఒక అనుమానం కూడా హరి రామ జోగయ్య లేఖ ద్వారా లేవనెత్తినట్లు అవుతుంది. ఇది పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మీద బ్లాక్ మెయిలింగ్ అని ఇప్పటికే తెలుగుదేశం వర్గాలు కొంత ఆగ్రహాన్ని ప్రకటించడం ప్రారంభించాయి. 30 సీట్లలోపే జనసేనకు కేటాయించవచ్చు అనే విషయం వార్తల్లో నలుగుతూ ఉంటే ఏకంగా 50 సీట్లకు హరి రామ జోగయ్య అభ్యర్థులనే ప్రకటించేశారు. ఇది మరో సంచలనం. పనిలో పనిగా ఆయన తన కుమారుడికి ఒక సీటు, ముద్రగడ పద్మనాభం గారి కుమారుడికి ఒక సీటు కూడా ఆయన కేటాయించుకున్నారు. ఈ లేఖ విషయంలో జనసేన నుంచి గాని జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి గాని ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. కానీ హరి రామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసినట్లుగా చెబుతున్న ఈ లేఖ ఇప్పటికే రెండు పార్టీల మధ్య సయోధ్య విషయంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్లాన్ బి ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదరకపోతే బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఒక 60, 70 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తే ఏ మేరకు విజయావకాశాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఆయన తమ పార్టీకి చెందిన ప్రముఖులతో సమావేశమై మంతనాలు సాగించిన వార్తలు కూడా వచ్చాయి. ఈ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు హరి రామ జోగయ్య లేఖ తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఒత్తిడి తీసుకురావడానికి అని అర్థమవుతుంది. దీని పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆ స్పందనకు ముందే ఈ లేఖ రెండు పార్టీల మధ్య ఒక తాజా రాజకీయ రగడకు కారణమైంది. మరి ఈ లేఖ సృష్టించిన ఈ ఘర్షణ వాతావరణాన్ని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఎలా చక్కదిద్దుతారో, రానున్న రోజుల్లో ఈ లేఖ రెండు పార్టీల మధ్య బంధాన్ని గట్టి పరుస్తుందా.. లేక నీరు గారుస్తుందా అనేది వేచి చూడాలి.

Read Also : Modi : విపక్షాల విడివిడి యాత్రలు మోడీని ఎదుర్కోగలవా?