Site icon HashtagU Telugu

YSRCP Gunturu West : చంద్రగిరి ఏసురత్నాన్ని ఇబ్బంది పెడుతున్న న‌లుగురు నేతలెవరూ..?

gunturu west ysrcp

gunturu west ysrcp

చంద్రగిరి ఏసురత్నం ప్రస్తుతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డుకు ఛైర్మన్. డీఐజీగా సేవలందించిన ఆయన.. వాలంటీర్ రీటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పాపం రాజకీయం అనుభవం లేని ఏసురత్నాన్ని గుంటూరులోని నలుగురు నేతలు ఎంతో ఇబ్బంది పెట్టారు..ఇంకా పెడుతున్నారంటా. తనను రాజకీయంగా ఎదగనివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని త‌న స‌న్నిహితుల వ‌ద్ద ఏసుర‌త్నం వాపోతున్నారు.

వైసీపీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్

2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి.. వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఆ తర్వాత నియోకవర్గంలో చంద్రగిరి ఏసురత్నానికి ప్రాధాన్యత తగ్గిందని ఆయన అనుచరులు వాపోతున్నారటా. దీనికి తోడు 2014 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన లేళ్ల అప్పిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల‌కు సంబంధించిన వివరాలను కొన్ని చెప్పలేదంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏసురత్నం. ఇన్నాళ్లు శత్రువు పక్క పార్టీలో ఉన్నాడు అనుకుంటే.. మళ్లీ ఆయన వైసీపీలో చేరి తన పక్కనే కూర్చుంటూ.. తనకే వెన్నుపోటు పోడిచారని ఏసుర‌త్నం ఆవేదన చెందుతున్నారంటా.

నలుగురి నాశనం కోసం దేవుడికి పూజలు చేస్తున్నాను: ఏసురత్నం

దీనికి తోడు 2019 ఎన్నికల సమయంలో నలుగురు కీలక నేతలు తనను వెన్నుపోటు పొడిచారని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఏసురత్నం. వారు వైసీపీలోనే ఉన్నారని.. వారిని ఏం చేయలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నట్లు వెల్లడించారు. ఆ నలుగురిని నాశనం చేయమని దేవుడికి ప్రతి రోజు ప్రార్థన చేస్తున్నట్లు మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి తన బిడ్డల భవిష్యత్తును నాశనం చేశారని వాపోయారు. బీసీ వడ్డెర కులానికి చెందిన తనను సీఎం జగన్ ఆదరించారన్నారు. ఆ తర్వాత మూడు పర్యాలుగా మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఇచ్చి ఆదరించారన్నారు. కానీ కొన్ని దుష్ట శక్తుల వల్ల ప్రజలకు మాత్రం దూరం కాలేదన్నారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

ఇంతకీ ఆ నలుగురు వ్యక్తులు ఎవరూ..?

పోలీసు అధికారిగా ఎంతో పేరు తెచ్చుకున్న చంద్రగిరి ఏసురత్నాన్ని ఇబ్బంది పెట్టిన ఆ నేతలు ఎవరనే దానిపై ఇప్పుడు గుంటూరులో చర్చ మొదలైంది. రాజకీయం తెలియదని ఆయన్ని మోసం చేశారనే కామెంట్లు ఇప్పుడు గుంటూరు మిర్చిలాగే ఘాటు పెంచుతున్నాయి. మొత్తానికి 2024 ఎన్నికల్లో సీఎం జగన్ పశ్చిమ నియోజకవర్గంలో ఓడిన ఏసురత్నానికి అవకాశం ఇస్తారా..? లేక పార్టీ మారిన మద్దాలి గిరికి అవకాశం ఇస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.