Guntur Air Taxi : ఏకంగా ఎయిర్ ట్యాక్సీలను గుంటూరులో తయారు చేసే దిశగా యువతేజం చావా అభిరాం ముందడుగు వేశారు. ‘మ్యాగ్నమ్ వింగ్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. గుంటూరు శివారులోని నల్లచెరువులో ఎయిర్ ట్యాక్సీలను ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న ఎయిర్ ట్యాక్సీలలోని మోటార్లు మినహా మిగతా పరికరాలన్నీ మేడిన్ ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ ద్వారా ఎయిర్ ట్యాక్సీ సేవలను అందించడంతో పాటు కావాలనుకున్నవారికి వాటిని విక్రయించనున్నారు.
Also Read :BJP Chief Post : బీజేపీ చీఫ్ రేసు.. ఆ నలుగురి మధ్యే ప్రధాన పోటీ
పట్టు వదలకుండా చావా అభిరాం ప్రయత్నాలు..
- చావా అభిరాం(Guntur Air Taxi) గుంటూరు వాస్తవ్యులు.
- ఆయన అమెరికాలో రోబోటిక్స్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తి చేశారు.
- మన దేశంలోని నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందని అభిరాం భావించారు.
- ఎయిర్ ట్యాక్సీల తయారీపై ఆయన అధ్యయనం చేశారు. దేశ, విదేశాల్లో వాటికి సంబంధించి జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు.
- 2019 సంవత్సరంలో గుంటూరు శివారులోని నల్లచెరువులో ‘మ్యాగ్నమ్ వింగ్స్’ సంస్థను ఏర్పాటు చేశారు.
- ఈ యూనిట్‌లో తొలి విడతలో చిన్నసైజు ఎయిర్ ట్యాక్సీని తయారుచేశారు. పైలట్ లేకుండా భూమిపై నుంచే నియంత్రించేలా దాన్ని రూపొందించారు. దానికి సంబంధించిన ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి.
- పైలట్ లేని ఎయిర్ ట్యాక్సీలను భారత పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) అనుమతించదు. అందుకే పైలట్ కూడా ఉండేలా రెండు సీట్లు, మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేసే పనిలో అభిరాం నిమగ్నమయ్యారు.
- ఈ ఎయిర్ ట్యాక్సీల తయారీకి పూర్తిగా స్వదేశీ ఉపకరణాలనే వాడుతున్నారు.
- రెండు సీట్లతో కూడిన ఒక ఎయిర్ ట్యాక్సీని తయారు చేసి, దానికి వీ2 అని పేరు పెట్టారు. దానితో ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.2 కోట్లు ఉంటుందట.
- ఇక మూడు సీట్లతో కూడిన ఎక్స్-4 రకం ఎయిర్ ట్యాక్సీ తయారీపై అభిరాం ఫోకస్ పెట్టారు. మరో నెలరోజుల్లో దీన్ని తయారు చేసి, ట్రయల్స్ చేయనున్నారు. మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.8 కోట్లు ఉంటుందట.
- వీ2, ఎక్స్-4 రకం ఎయిర్ ట్యాక్సీలు బ్యాటరీతో నడుస్తాయి. ఆకాశ మార్గంలో దూరం తక్కువ. అందుకే వీటి నిర్వహణ ఖర్చు తక్కువ.
- వీ2 ఎయిర్ ట్యాక్సీలోని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే.. గరిష్ఠంగా 40 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది 1000 అడుగుల ఎత్తులో ఇది గరిష్ఠంగా 100 కి.మీ వేగంతో వెళ్తుంది.
- ఎక్స్-4 ఎయిర్ ట్యాక్సీలోని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే.. 300 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది 20వేల అడుగుల ఎత్తులో గరిష్ఠంగా 300 కి.మీ వేగంతో వెళ్తుంది.