భారీ వర్షాలు కురవడంతో నదులు, సముద్రాలు, కుంటలు జల ప్రవహంతో కళకళాలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన చెరువులన్నీ జల ప్రవాహంతో కదంతొక్కుతూ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు.. వర్షాల రాకతో జలమయమైన చెరువులు వివిధ అరుదైన పక్షులతో కనువిందు చేస్తున్నాయి. చూపరులను రారమ్మని పిలుస్తున్నాయి. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ల చెరువులో సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పక్షులు ఈ పరిసరాలకు వచ్చాయి. వీటిని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు వస్తున్నారు.
ఆ పక్షులు ఏటా క్రమంతప్పక వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకుంటున్నాయి. ఇక్కడే సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. పిల్లలకు ఎగరడం రాగానే తిరిగి తమ దేశానికి వెళ్లిపోతాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఆ పక్షులు రష్యా నుంచి ఇక్కటికి వస్తుంటాయి.
ఏళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఇక్కడే జతకట్టి గుడ్డుపెట్టి పిల్లల్ని పొదిగి అవి ఎగిరే వరకు ఇక్కడే ఉండి వెనుదిరుగుతాయి. గ్రామస్థులు సైతం వాటికి ఎలాంటి హాని తలపెట్టడంలేదు. ప్రస్తుతం అరకిలోమీటరు వ్యవధిలోనే పక్షులు సందడి చేస్తున్నాయి. మెడనుంచి ముక్కు వరకు పసుపు రంగు కలిగి, పొడవైన కాళ్లు, ఒంపులు తిరిగిన మెడ, ఎర్రటి ముక్కు, అందమైన చారలు కలిగి, వెడల్పయిన రెక్కలతో కనువిందు చేస్తున్నాయి.
Also Read: MLA Seethakka: వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీతక్క డిమాండ్