Site icon HashtagU Telugu

AP New Cabinet : కొత్త మంత్రుల‌కు `గ్రూప్ ల‌` బెడ‌ద‌

Ap New Cabinet

Ap New Cabinet

మంత్రి ప‌ద‌వొచ్చింద‌న్న సంతోషం క్ర‌మంగా ఏపీ మంత్రుల్లో క‌రిగిపోతోంది. స్థానికంగా ఉండే నేత‌లు క‌లిసి రాక‌పోవ‌డంతో ప‌లు చోట్ల త‌ల‌నొప్పిగా మారింది. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సీనియ‌ర్ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ అసంతృప్తిగా ఉన్నార‌ని టాక్‌. అందుకే, ఆయ‌న విద్యాశాఖ‌పై నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశానికి డుమ్మా కొట్టార‌ని స‌చివాల‌య‌వ‌ర్గాల టాక్‌. గత క్యాబినెట్ లో ఆయ‌న మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఈసారి విద్యాశాఖ‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు. కానీ, ఆయ‌న‌కు ఆ శాఖ‌పై పెద్ద‌గా ఇష్టంలేద‌ని స‌హ‌చ‌రులు చెబుతున్నారు. అయిష్టంగా ఉన్న ఆయ‌న రివ్యూ స‌మావేశాల‌కు దూరంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, సొంత ప‌నుల్లో బీజీగా ఉన్న కార‌ణంగా బొత్సా స‌మీక్షా స‌మావేశానికి రాలేక‌పోయార‌ని కొంద‌రు చెబుతున్నారు.తొలి స‌మావేశానికి డుమ్మా కొట్ట‌డంతో ఆయ‌న వాల‌కం హాట్ టాపిక్ అయింది.ప్ర‌కాశం జిల్లా మంత్రిగా మ‌రోసారి ఆదిమూల‌పు సురేష్ కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌కు ప్రాముఖ్య‌త‌ను ఇస్తూ మున్సిప‌ల్ అండ్ ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ను జ‌గ‌న్ అప్ప‌గించారు. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ప్ర‌స్తుతం ఉన్న మంత్రి సురేష్ పై గుర్రుగా ఉన్నారు. తొలి క్యాబినెట్ లో ఇద్ద‌రూ మంత్రులుగా కొన‌సాగారు. కానీ, ఈసారి బాలినేనికి హ్యండిస్తూ సురేష్ ను కొన‌సాగించ‌డం ఆ జిల్లా వైసీపీలో అంత‌ర్గ‌త‌పోరును రాజేసింది. కొనసాగిస్తే ఇద్ద‌రికీ అవ‌కాశం ఇవ్వండి లేదంటే ఇద్ద‌రినీ తొల‌గించ‌డంటూ బాలినేని కండీష‌న్ పెట్టాడ‌ని మంత్రివ‌ర్గం ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌ద్విరుద్ధంగా జ‌ర‌గ‌డంతో నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న బాలినేని వ‌ర్గం సురేష్ మీద అసంతృప్తిగా ఉంది. అంతేకాదు, అదే జిల్లాకు చెందిన సీనియ‌ర్లకు మంత్రి ప‌ద‌వులు రాక‌పోవ‌డంతో చాప‌కింద నీరులా వాళ్ల ప‌ని వాళ్లు చేసుకుంటున్నారు. పార్టీకి గుడ్ బై చెప్ప‌డానికి స‌రైన స‌మ‌యాన్ని చూసుకుంటున్నార‌ని టాక్‌.

నెల్లూరు జిల్లాలో ఉన్న సీనియ‌ర్ లీడ‌ర్ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి చివ‌రి వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి కోసం వేచిచూశారు. కానీ, కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డికి వ‌చ్చింది. ఫ‌లితంగా మంత్రి ప‌ద‌వుల‌ను ఆశించిన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి క‌న్నీటిప‌ర్యంతం అయ్యారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ వ‌ర్గం కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి పై అవ‌కాశం చూసుకుని దెబ్బ‌కొట్ట‌డానికి సిద్ధం అయింది. ప్రొటోకాల్ వ్య‌వ‌హారంతో పాటు ఫ్లెక్సీల ఏర్పాటు విష‌యంలోనూ ప‌లుమార్లు అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న‌ప్పుడు వివాదాలు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ వివాదాలు మ‌రింత తీవ్ర‌రూపం దాల్చ‌డానికి అవ‌కాశం ఉంది. మంత్రి కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి దూకుడుగా ఉంటారు. పైగా సోలోగా రాజ‌కీయాలు చేయాల‌ని భావిస్తుంటారు. ఆయ‌న వాల‌కంతో శ్రీథ‌ర్ రెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్ క‌లిసి వెళ్లే ఛాన్స్ త‌క్కువ‌. ఇక సీనియ‌ర్ గా ఉన్న మాజీ మంత్రి ఆనం మౌనంగా ఉన్నారు. స‌మ‌యం చూసి పార్టీ మార‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని ఆయ‌న అనుచ‌రులు చ‌ర్చించుకుంటున్నారు. అదే జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్ మాజీ మంత్రి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి భ‌విష్య‌త్ రాజ‌కీయాలను ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. గుర్రుగా ఉన్న వైసీపీలోని మాజీ మంత్రులు ప్ర‌స్తుతం ఉన్న మంత్రి గోవ‌ర్థ‌న్ రెడ్డి తో క‌లిసి వెళ్ల‌డం క‌ష్టమే.మంత్రి ప‌ద‌విని రోజాకు ఇవ్వ‌డంతో చిత్తూరు జిల్లాలోని వైసీపీ సీనియ‌ర్లు లోలోప‌ల ర‌గిలిపోతున్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలోనే ఆమెతో క‌లిసి న‌డ‌వ‌డానికి స్థానిక లీడ‌ర్లు సిద్ధంగా లేరు. మండ‌లాధ్య‌క్షులు, మున్సిప‌ల్ చైర్మ‌న్లుగా ఉన్న లీడ‌ర్లు రోజా నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. అంతేకాదు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్గానికి రోజాకు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ విష‌యాన్ని చూశాం. ఇక ఇప్పుడు మంత్రిగా రోజా ఉన్న‌ప్ప‌టికీ ఐక్యంగా ఉంటార‌న్న న‌మ్మ‌కం లేదు. మంత్రుల గ్రూప్ ఫోటో సంద‌ర్భంగా మ‌హిళా మంత్రులు ఇద్ద‌రు ఒక చోట కూర్చుంటే, రోజా మాత్రం ద‌ర్జాగా పెద్దిరెడ్డి ప‌క్క‌న ఉన్నారు. సరిగ్గా ఈ ఫోటోను చూసిన పెద్దిరెడ్డి వ‌ర్గం రోజా ద‌ర్పాన్ని ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు. ఇలాంటి ప‌రిణామాలు భ‌విష్య‌త్ లో చాలా చూసే అవ‌కాశం లేక‌పోలేదు.

కొత్త‌గా మంత్రులుగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఉష‌శ్రీ చ‌ర‌ణ్ ప‌రిస్థితి కూడా స్థానికంగా ఇబ్బందే. ఆమెతో క‌లిసి న‌డ‌వ‌డానికి అనంత‌పురం జిల్లా వైసీపీ సీనియ‌ర్లు సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. మంత్రి ప‌ద‌వుల‌ను ఆశించి అక్క‌డ నుంచి భంగ‌ప‌డ్డ వాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో జోగి రమేష్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని సీనియ‌ర్ మాజీ మంత్రి పార్థ‌సార‌థి జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆయ‌న స్థానంలో నాగేశ్వ‌ర‌రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై ఆ సామాజిక‌వ‌ర్గం పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూప‌డంలేదు. పైగా స్థానికంగా ఉండే లీడ‌ర్లు నాగేశ్వ‌ర‌రావు మీద అసంతృప్తిగా ఉన్నారు. ఆయిన‌ప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌కుండా స‌రైన స‌మ‌యం కోసం చూస్తున్నారు. ఏ రోజైనా నాగేశ్వ‌ర‌రావుపై స్థానిక లీడ‌ర్లు తిర‌గ‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఇసుక వ్య‌వ‌హారంలో అక్క‌డ వైసీపీ వ‌ర్గాల్లో విభేదాలు ఉన్న విష‌యం విదిత‌మే.విశాఖ జిల్లాలోనూ మాజీ మంత్రి అవంతి వ‌ర్సెస్ ఇత‌ర లీడ‌ర్ల మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. ప‌లుమార్లు తాడేప‌ల్లి కేంద్రంగా పంచాయ‌తీ కూడా చేశారు. ప్రస్తుతం అక్క‌డ మంత్రిగా గుడివాడ అమ‌ర్నాథ్ కు ప‌ద‌వి వ‌రించింది. కానీ, అనేక మంది ఆశావ‌హులు ఢీలా ప‌డ్డారు. వాళ్లంతా ఒకే వేదిక‌పైకి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. అమ‌ర్నాథ్ వర్సెస్ విశాఖ వైసీపీ లీడ‌ర్లు అనేలా విభేదాలు పొడ‌చూప‌నున్నాయ‌ని భావిస్తున్నారు. ఉద్ధండులున్న కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు హ్యాండిచ్చిన జ‌గ‌న్ ఆ జిల్లా నుంచి జోగిర‌మేష్‌, విడ‌ద‌ల ర‌జిని మంత్రి అయ్యారు. ఆమెతో క‌లిసి న‌డ‌వ‌డానికి సీనియ‌ర్లు సిద్ధంగా లేర‌ని స్థానిక నేత‌ల వాద‌న‌. అదే జిల్లా నుంచి మంత్రి ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డ్డ పిన్నెల్లి ల‌క్ష్మారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, అబ్బ‌య్య చౌద‌రి త‌దిత‌ర క‌మ్మ సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్లు మంత్రి ప‌ద‌వుల‌ను ఆశించారు. కానీ, ఆ సామాజిక‌వ‌ర్గానికి స్థానం లేకుండా జ‌గ‌న్ పెద్ద డేర్ చేసి క్యాబినెట్ ను ఏర్పాటు చేశారు. ఫ‌లితంగా ఆ సామాజిక‌వ‌ర్గంకు చెందిన వైసీపీ లీడ‌ర్లు గుర్రుగా ఉన్నారు. మంత్రిగా ఉన్న జోగి ర‌మేష్ క‌లిసి న‌డిచేందుకు కృష్ణా జిల్లాకు చెందిన లీడ‌ర్లు వెనుక‌డుగు వేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తం మీద నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి వైసీపీలో ఏదో ఒక స‌మ‌యంలో పెల్లుబికే అవ‌కాశం లేక‌పోలేదు. కొత్త మంత్రివ‌ర్గంతో జ‌గ‌న్ లేని స‌మ‌స్య‌ల‌ను తెచ్చుకున్నాడ‌ని సర్వ‌త్రా వినిపిస్తోంది.