Devansh Birthday: ఇవాళ (మార్చి 21) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ్ బర్త్ డే. ఈసందర్భంగా నారా కుటుంబం తిరుమలకు చేరుకుంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారి మూలమూర్తిని దర్శించుకోనున్నారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పొందుతారు. ఆ తర్వాత మాడవీధుల గుండా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ దేవాంశ్ పేరుతో ఒకరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కుటుంబీకులు పాల్గొంటారు. వారు స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు. అనంతరం వారు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈరోజు తిరుమల అన్నప్రసాద(Devansh Birthday) కేంద్రంలో అయ్యే ఖర్చు కోసం రూ.45 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు ఇచ్చారు.
Also Read :Phone Connections: జనాభా కంటే ఫోన్ కనెక్షన్లే ఎక్కువే.. ‘ల్యాండ్‌లైన్’ పతనం
రెండు రోజుల పర్యటన
ఈరోజు నుంచి రెండు రోజులపాటు సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమలలో పూజల అనంతరం టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులతో తిరుమల క్షేత్ర అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. తిరుమల విజన్-2047పై సీఎం చర్చించనున్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతానని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలలో జరిగిన మార్పులు, భక్తులకు అందతున్న సేవలపై అధికారులతో ఆయన మాట్లాడుతారు. లడ్డూ ప్రసాదాల నాణ్యత, అన్నప్రసాద కేంద్రాల్లో ప్రసాదాల వితరణ, క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీయనున్నారు.నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు సీఎం హోదాలో రెండోసారి తిరుమల పర్యటనకు వచ్చారు.
Also Read :KKR vs RCB: ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మొదటి మ్యాచ్ రద్దు?
దేవాంశ్ ప్రతిభాపాఠవాలు
2024 సంవత్సరం డిసెంబరు నాలుగోవారంలో నారా లోకేశ్ తనయుడు దేవాంశ్ ప్రపంచ రికార్డును క్రియేట్ చేశారు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించారు. దీంతో తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్’ రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్ పూర్తిచేసిన దేవాంశ్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ‘‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’’ అన్న పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్‌తో ఈ పోటీని రూపొందించారు. దేవాంశ్ ఇటీవల 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్‌ని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తిచేశాడు. అలాగే, 9 చెస్‌బోర్డుల్ని 5 నిమిషాల్లో అమర్చాడు. ప్రతి బోర్డులోనూ మొత్తం 32 పావుల్ని వేగంగా సరైన స్థానాల్లో ఉంచాడు. ఈ ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించి ధ్రువీకరించారు. వీటితోపాటు దేవాంశ్ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ – లండన్’ అధికారికంగా ధ్రువీకరించింది.