ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా చంద్రబాబు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని విజయవంతంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు (Chandrababu), ఇప్పుడు అదే మోడల్‌ను అనుసరించి విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకమైన “డేటా సిటీ”(Data City)ని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఐటీ రంగంలో విభిన్న కేటగిరీల కోసం మౌలిక సదుపాయాలు కల్పించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆవిష్కరణల కోసం విశాఖను కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ లక్ష్యం గా పెట్టుకుంది..
500 ఎకరాల్లో డేటా సిటీ ప్రణాళిక :
విశాఖ సమీపంలోని మధురవాడలో 500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేగవంతం చేశారు. ఈ సిటీ ద్వారా ఐటీ సంస్థలకు విశాల స్థలాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా , ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వ దృష్టి సారించింది.
డేటా సిటీ కాన్సెప్ట్‌పై ఇప్పటికే గూగుల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. గూగుల్ 80 ఎకరాల్లో డేటా సెంటర్‌ను నిర్మించేందుకు ముందుకు రాగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 30 ఎకరాల్లో ఐటీ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనుంది. ఇది రాష్ట్రంలో ఐటీ రంగం వికాసానికి కొత్త దిశగా మారనుంది. ఇక దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అనేక అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపారు. టెమాసెక్ హోల్డింగ్స్, కాగ్నిజెంట్ వంటి సంస్థలతో సాగిన చర్చలు రాష్ట్రంలో డేటా సెంటర్లు, AI హబ్‌ల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చాయి. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుతో రాష్ట్రం టెక్నాలజీ రంగంలో కీలకంగా నిలవడమే కాకుండా, సమీప రాష్ట్రాలకు సైతం ఒక ఆర్ధిక కేంద్రంగా మారనుంది. ఈ ప్రాజెక్టు ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో, ఉద్యోగావకాశాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషించనుందని అంత భావిస్తున్నారు.