Site icon HashtagU Telugu

Amaravati Land Sale: రూ.2500 కోట్ల కోసం అమరావతిలో భూముల అమ్మకానికి సీఆర్డీఏకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Secretariat

Andhra Pradesh Secretariat

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అప్పో రామచంద్రా అనే పరిస్థితి వచ్చింది. కొన్నాళ్లుగా అప్పుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదు. చివరకు రుణం ఇవ్వడానికి బ్యాంకులు కూడా అంగీకరించడం లేదు. అందుకే ఇప్పుడు వేరే దారిలేక నిధులను సమకూర్చుకోవడం కోసం రాజధాని అమరావతిలోని భూములను అమ్మడానికి సిద్ధపడింది. కేపిటల్ సిటీలోని 248.34 ఎకరాలను అమ్మడానికి సీఆర్డీఏ ఇప్పటికే ప్లాన్ తయారుచేసింది. ఒక్కో ఎకరాన్ని కోటి రూపాయిలకు అమ్మాలని డిసైడ్ అయ్యిది. అంటే దీనివల్ల సర్కారుకు దాదాపు రూ.2480 కోట్లు వచ్చే అవకాశం ఉంది.

టీడీపీ ప్రభుత్వం 2016లో బీఆర్ షెట్టి మెడిసిటీకి 100 ఎకరాలను కేటాయించింది. వీరితోపాటు లండన్ లోని కింగ్స్ కాలేజీకి 148 ఎకరాలను ఇచ్చింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండు కేటాయింపులను రద్దు చేసింది. ఇప్పుడు ఈ రెండింటి రద్దు వల్ల మిగిలిన భూముల్లో 148 ఎకరాలను సీఆర్డీఏ అమ్మనుంది. అయినా మంగళగిరికి దగ్గరలో ఉన్న ఓ లేవుట్ లో 20 ఏళ్ల కిందటే అభివృద్ధి చేసిన స్థలాలను అమ్మకానికి పెట్టినా సరే.. కొనడానికి ఒకరిద్దరు మాత్రమే ముందుకు వచ్చారు. మరిప్పుడు రాజధానిలో ఎకరా రూ.10 కోట్లంటే ఎంతమంది కొనుగోలుకు వస్తారు అన్న సందేహాలను విపక్షాలు వ్యక్తపరుస్తున్నాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు ఈమధ్యనే ఏపీ సీఎం జగన్.. రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధానిని అభివృద్ధి చేయడం కోసం నిధులను సమీకరించడానికి భూములను అమ్మడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మార్చి 3న ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఏపీ సర్కారుతోపాటు సీఆర్డీఏ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టాలి. ఆ ప్రగతికి సంబంధించిన అఫిడవిట్ ను ఆరు నెలల్లో కోర్టుకు ఇవ్వాలి. అలాగే రాజధాని అభివృద్ధికి భూములిచ్చిన ఒప్పందాలను కూడా గౌరవించాలని కోర్టు ఆదేశించింది.

రాజధానిలో వసతులను ఏర్పాటుచేయడానికి సీఆర్డీఏ రూ.3500 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ దానిని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కోరింది. కానీ ఆర్థిక శాఖ నుంచి ఇంకా ఆ ప్రతిపాదనకు క్లియరెన్స్ రాలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తో కూడిన కన్సార్టియం నుంచి ఈ మొత్తాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తోంది.

రాజధాని అవసరాల కోసం తప్ప ఇతర అవసరాలకు అమరావతిలో భూములు అమ్మకూడదని హైకోర్టు ఇదివరకే స్పష్టంగా చెప్పింది. అంటే కేపిటల్ సిటీలోని భూములను అమ్మాలన్నా సరే.. భవిష్యత్తు అవసరాల కోసం పక్కన పెట్టిన ల్యాండ్ మాత్రమే అమ్మాలి. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ప్రకారం కేటాయించిన భూములను అమ్మడానికి అవకాశం లేదు. ఇక వచ్చే 20 సంవత్సరాల్లో అమరావతిలోని భూములను దశలవారీగా అమ్మడానికి డీపీఆర్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీనిని ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎసెట్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వివిధ దశల్లో 500 ఎకరాలను అమ్మడానికి ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం.