ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు (CBN)వెల్లడించిన వివరాల ప్రకారం.. గూగుల్ (Google) సంస్థ వచ్చే నెలలో విశాఖపట్నానికి రానుంది. ఈ సందర్శనతో పాటు విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తుండటంతో భవిష్యత్‌లో వేలాది ఐటీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
Auction of Land : మరోసారి భూముల వేలం వేయబోతున్న రేవంత్ సర్కార్
అదే విధంగా రాష్ట్రంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు కూడా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ త్వరలోనే ఏర్పాటు కానుందని సీఎం తెలిపారు. ఈ పరిశ్రమ వాస్తవ రూపం దాల్చితే, ఆంధ్రప్రదేశ్ ఉక్కు ఉత్పత్తిలో కీలక స్థానం సంపాదించడమే కాకుండా, అనుబంధ పరిశ్రమలకు కూడా ఊతం లభించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నాయని చెప్పారు. ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాల్లో ఇప్పుడు రోడ్లు, పరిశ్రమలు, ఐటీ హబ్‌లు వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇక రాబోయే రోజుల్లో అనంతపురంలోని లేపాక్షి నుంచి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు వరకు ఉన్న విస్తీర్ణం భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారనుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన భూసేకరణ, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. రాబోయే దశాబ్దంలో ఈ ప్రాంతం దక్షిణ భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా నిలవనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.