ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి టెక్నాలజీ రంగంలో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో AI హబ్ (Artificial Intelligence Hub) ప్రారంభం అవ్వడం దేశ టెక్ రంగానికి మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ AI హబ్‌లో గిగావాట్ స్థాయి సామర్థ్యం గల డేటా సెంటర్ ఏర్పాటుతో భారీ స్థాయిలో ఉద్యోగాలు, పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. గూగుల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశ వ్యాప్తంగా డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ కేంద్రంగా మార్చే దిశలో పెద్ద అడుగుగా భావిస్తున్నారు.
Google : రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు – మంత్రి లోకేశ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్‌పై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన అన్నారు: “గిగావాట్ సామర్థ్యం గల ఈ డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనున్నాయి. కృత్రిమ మేధస్సు (AI), టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తివంతమైన ఆయుధం అవుతుంది. ఇది భారత డిజిటల్ ఎకానమీని పెంచడంలోనూ, ప్రపంచ టెక్నాలజీ లీడర్‌గా భారత స్థానాన్ని మరింత బలపరిచడంలోనూ సహకరిస్తుంది” అని పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలతో ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విశాఖ AI హబ్ భారతదేశంలోని స్టార్టప్‌లకు, పరిశోధనా సంస్థలకు, విద్యార్థులకు, పరిశ్రమలకూ గొప్ప వేదిక కానుంది. దీని ద్వారా డేటా ప్రాసెసింగ్, AI ఆధారిత అప్లికేషన్లు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కొత్త అవకాశాలు లభించనున్నాయి. అంతేకాక, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరింత బలపడుతుంది. గూగుల్ పెట్టుబడులు రాష్ట్రానికి ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావనున్నాయి. దీని వల్ల విశాఖ నగరం భారత టెక్ మ్యాప్‌లో మరింత ప్రతిష్ఠాత్మక స్థానాన్ని దక్కించుకోనుంది.
