దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యా్తంగా వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గతేడాది మార్చి 31తో ఈ గడువు ముగియగా.. తాజాగా దాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించారు. అంటే పోస్టుల భర్తీకి కాలపరిమితి మరో ఏడాది పెంచారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి ప్రత్యేక నియామక డ్రైవ్ చేపట్టాలని అన్ని శాఖల్ని ఆదేశించింది. ఈ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉత్తర్వులు. రిజర్వేషన్ నిబంధనలు, నియామక మార్గదర్శకాలకు కట్టుబడి భర్తీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టింది. ముగ్గురు మాజీ మున్సిపల్ కమిషనర్లు, 43 మంది ఇతర అధికారులపై అభియోగాలు నమోదు చేస్తూ 63 ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2019-24 మధ్య కాలంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి చెందిన ఉచిత అన్నదాన కేంద్రానికి స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫిర్యాదుతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించగా, ఆ కమిటీ సిఫారసుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ కేసులో ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్లుగా పనిచేసిన చంద్రమౌళీశ్వరరెడ్డి, రాధా, వెంకటరమణయ్య, పట్టణ ప్రణాళిక విభాగం సహాయక కమిషనర్ మునిరత్నం, ఇద్దరు విశ్రాంత అధికారులు, ముగ్గురు ఏఈలు, ఇద్దరు ఎకౌంట్స్ సెక్షన్ సిబ్బంది, 24 మంది సచివాలయ వార్డు కార్యదర్శులు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి సిఫారసులు పంపిన విచారణ బృందం, ఈ అక్రమాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామాలతో పురపాలక శాఖలో అలజడి నెలకొంది.
