Site icon HashtagU Telugu

Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగ అవకాశాలు

Jobs

Jobs

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మరో పెద్ద అడుగు వేశారు. ఆయన ప్రకటించిన దాని ప్రకారం, 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన సంకల్పం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో గురువారం (అక్టోబర్ 30న) జరిగిన నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలు కల్పించేందుకు “నైపుణ్యం పోర్టల్” కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగాలే కాకుండా, నైపుణ్య శిక్షణ, భాషా శిక్షణ, మరియు ఉన్నత విద్యకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.

ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు (Job Fairs) నిర్వహించి, నిరుద్యోగులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించాలని. రాబోయే నవంబర్‌లో జరగబోయే సీసీఐ భాగస్వామ్య సదస్సులో “నైపుణ్యం పోర్టల్” అధికారికంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వం నైపుణ్య శిక్షణ పొందిన వారికి అధికారిక ధ్రువపత్రాలు (Certificates) కూడా అందించనుంది. దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను ఈ పోర్టల్‌లో సమగ్రంగా అందుబాటులో ఉంచి, విదేశాల్లో ఉద్యోగాలు పొందే యువతకు అవసరమైన భాషా శిక్షణలను కూడా అందించాలనే ఆదేశాలు ఆయన ఇచ్చారు. . “నైపుణ్యం పోర్టల్‌ యువతకు ఉద్యోగాలకు గేట్‌వేలా మారాలి; ప్రతి శిక్షణ పొందిన వ్యక్తి సాంకేతికంగా బలోపేతం కావాలి.” అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు

ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర యువతను స్పేస్‌, క్వాంటం, ఆక్వా వంటి ఆధునిక రంగాల్లో పనిచేయగల సాంకేతిక నైపుణ్యాలతో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ దిశగా 15 క్లస్టర్‌ల ఆధారంగా మానవ వనరుల అభివృద్ధి ప్రణాళికను చేపట్టినట్లు వివరించారు. ఆస్ట్రేలియాలో క్లస్టర్ ఆధారిత నైపుణ్య అభివృద్ధి విధానాన్ని అధ్యయనం చేసి, ఆ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, ఈ పోర్టల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లు సిద్ధం చేయడం, ఇంటర్వ్యూల సిమ్యులేషన్‌లలో ప్రాక్టీస్ చేయడం వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ సంవత్సరం మేలో ఏపీ ప్రభుత్వం, యూనిసెఫ్‌తో కలిసి “Youth for Social Impact (YFSI)”, “Youth Hub”, “Passport to Earning (P2E)” అనే మూడు కార్యక్రమాలను ప్రారంభించింది. ఇవి యువతలో వ్యాపార, వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, ఆంధ్రప్రదేశ్‌ను “స్కిల్ కేపిటల్ ఆఫ్ ఇండియా”గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాయి.

Exit mobile version