AP Budget 2025-26 : మత్స్యకారులకు గుడ్ న్యూస్

AP Budget 2025-26 : ఎన్నికల హామీ మేరకు అర్హులైన సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు చేపల వేట నిషేధ కాల భృతి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపారు

Published By: HashtagU Telugu Desk
Good News For Fishermen

Good News For Fishermen

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌(AP Budget 2025-26)లో మత్స్యకారులకు పెద్ద ఊరట(Good news for fishermen)ను అందించింది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌లో మత్స్య, ఆక్వా రంగాన్ని ప్రోత్సహించే అనేక కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు చేపల వేట నిషేధ కాల భృతి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. దీని వల్ల 1,22,968 మంది మత్స్యకారులకు మొత్తం రూ.245.936 కోట్లు అందజేస్తామని వెల్లడించారు. అలాగే పులికాట్ సరస్సులోని 20వేల మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధి కోసం తిరుపతి జిల్లాలో సముద్ర ముఖద్వారం తెరవేందుకు రూ.97.09 కోట్లతో పనులను చేపట్టనున్నారు.

ఆక్వా రైతులకు రాయితీలు, సబ్సిడీలు

ఆక్వాకల్చర్ రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు, అర్హత కలిగిన 68,134 ఆక్వా సర్వీసు కనెక్షన్లకు తక్కువ ధరకే విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్క యూనిట్‌కు రూ.1.50 పైసల చొప్పున విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. అలాగే, డీజిల్‌ ఆయిల్‌ సబ్సిడీ కింద 2024-25లో రూ.50 కోట్లు ఖర్చు చేసి 28,058 బోట్లకు ప్రయోజనం అందించినట్లు తెలిపారు. 2025-26లోనూ అదే విధంగా రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆక్వా రైతుల కోసం PMMSY పథకం కింద రూ.417 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

మత్స్యరంగ అభివృద్ధికి భారీ కేటాయింపులు

ప్రభుత్వం మత్స్యరంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మద్దతుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 సంవత్సరానికి మొత్తం రూ.510.189 కోట్లు మత్స్యరంగ అభివృద్ధికి కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో 63 మంది మత్స్యకారులు చేపల వేటలో మరణించగా, వారి కుటుంబాలకు బకాయి ఉన్న రూ.3.15 కోట్లు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించినట్లు వెల్లడించారు. అలాగే, 2025-26లో ఈ నిధిని రూ.8 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా వ్యవసాయ, మత్స్య, ఆక్వా రంగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  Last Updated: 28 Feb 2025, 01:26 PM IST