Tirumala: ప్రవాసాంధ్రులకు శ్రీవారి దర్శనం ఇక మరింత సులభం కానుంది. ఇప్పటి వరకు తక్కువ సంఖ్యలో అందుతున్న వీఐపీ బ్రేక్ దర్శన కోటా పెరిగిందని, ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (APNRTS) ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రవాస భారతీయులలో ఆనందోత్సాహాలను కలిగిస్తోంది. ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో ఉన్న ప్రతినిధి బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ప్రవాసాంధ్రులకు అందుతున్న వీఐపీ బ్రేక్ దర్శన కోటా 50 నుంచి కేవలం 10కి తగ్గించబడిందని, దీంతో విదేశాల నుండి తిరుమలకు వచ్చే తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.
Read Also: Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. తజాకిస్తాన్, భారత్‌లోనూ ప్రకంపనలు
ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, ఈ కోటాను 10 నుంచి 100కు పెంచాలని తీర్మానించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ప్రతి రోజు వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను ప్రవాసాంధ్రులకు కేటాయించేందుకు సూచించారు. ఈ అవకాశాన్ని పొందాలంటే ప్రవాసాంధ్రులు ముందుగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అధికారిక వెబ్‌సైట్ (https://apnrts.ap.gov.in/) లో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. సభ్యత్వం పూర్తిగా ఉచితం. సభ్యత్వం పొందే సమయంలో ప్రవాసాంధ్రులు తమ వీసా, వర్క్ పర్మిట్ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సభ్యత్వం నమోదు అనంతరం, వెబ్‌సైట్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి మూడు నెలల విండోలో ఉన్న స్లాట్లు కనిపిస్తాయి. అందులో మనకు కావలసిన తేదీని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ రోజున అందుబాటులో ఉన్న టికెట్లను టీటీడీ పరిపాలనా పరంగా పరిశీలించి కేటాయిస్తుంది.
టికెట్ కేటాయింపు అయిన వారికి తిరుమలలోని ఏపీఎన్‌ఆర్‌టీఎస్ పీఆర్వో కార్యాలయం ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించబడుతుంది. వివరాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, ప్రవాసాంధ్రులు ఏపీఎన్‌ఆర్‌టీ వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు. అదేకాకుండా, ఏపీలోని తాడేపల్లి లో ఉన్న ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు. సంబంధిత సమాచారాన్ని ఈ క్రింది ఫోన్ నంబరులో పొందవచ్చు.. 0863-2340678. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు తిరుమల శ్రీవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకోవాలని సంస్థ ప్రతినిధి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇది ప్రవాసాంధ్రులకు ఎంతో గౌరవకరమైన మరియు ఆనందదాయకమైన పరిణామంగా భావించవచ్చు.
Read Also: Cesarean Deliveries : సిజేరియన్లలో తెలంగాణే టాప్