Site icon HashtagU Telugu

Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!

Ap Govt Ehs

Ap Govt Ehs

ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఈహెచ్‌ఎస్ పథకం లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య బిల్లుల ఆమోదంలో ఆలస్యం, రీయింబర్స్‌మెంట్ పరిమితుల పెంపు, ఆరోగ్య కార్డుల జారీ వంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ 8 వారాల్లో నివేదిక సమర్పించనుంది. అయితే ఈ 60 రోజుల్లో ఈహెచ్ఎస్ పథకంలోని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆశిస్తున్నారు.

ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు గతంలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం  తీసుకువచ్చారు. అయితే ఈ పథకం అనుకున్న విధంగా అమలుకు నోచుకోలేదు. పథకం అమలులో అనేక సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలను పరిష్కరించి.. ఆరోగ్య పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఉద్యోగులు విజ్ఞప్తులపై గత నెలలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ పథకంలోని దీర్ఘకాలిక లోపాలను సరిచేసేందుకు గురువారం (నవంబర్ 27) వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, జీఏడీ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ ముఖ్య కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు సీఈవో, ఇద్దరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కమిటీ వేశారు. ఈ కమిటీ 8 వారాల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపై ఏపీ ఐకాస ఛైర్మన్ అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి డీవీ రమణ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. 60 రోజుల్లోపు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వైద్య బిల్లుల ఆమోదంలో విపరీతమైన ఆలస్యం జరుగుతోందన్నారు. అంతేకాకుండా జిల్లాల్లో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల పరిశీలనకు ఉన్న పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచాలని కోరారు. ఇక ఉద్యోగుల వైద్యసేవల పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకుపైగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. విశ్రాంత సీపీఎస్‌ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల కోసం 2013లో ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే ఈ పథకం ద్వారా దాదాపు 24 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. పథకానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం, లబ్ధిదారులు చెరి సగం భరించాలి. దీని కోసం ఏటా దాదాపు రూ. 350 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే వైద్య సేవలకు చేసిన ఖర్చును సకాలంలో చెల్లించడం లేదని, వివిధ వ్యాధుల ప్యాకేజీ ధరలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈహెచ్‌ఎస్‌ కింద సేవలకు ఆసుపత్రులు ఆసక్తి చూపడంలేదని, ఫిర్యాదులకు పరిష్కారం దొరకడం లేదని, ఆన్‌లైన్‌ పోర్టల్‌లోనూ లోపాలున్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. తాజాగా కమిటీ ఏర్పాటైంది.

Exit mobile version