దీవాలి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల కొనుగోలు ఉత్సాహం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం విలువల పెరుగుదల కారణంగా దేశీయ బులియన్ మార్కెట్లలో కూడా ధరలు ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.1,28,890కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.500 పెరిగి రూ.1,18,150గా నమోదైంది. ఈ పెరుగుదలతో ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వినియోగదారులు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
Konda Surekha OSD : కొండా సురేఖ ఓఎస్టీ తొలగింపు
వెండి ధరలు కూడా అదే దారిలో కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,07,000కు చేరగా, కేవలం 10 రోజుల్లోనే రూ.42,000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనత, ముడి లోహాల డిమాండ్ పెరగడం, మరియు పెట్టుబడిదారులు సేఫ్ హావెన్‌గా బంగారం, వెండి వైపు మొగ్గు చూపడం వల్ల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పండుగ సీజన్‌లో ఆభరణాల డిమాండ్ పెరగడం కూడా స్థానిక మార్కెట్ ధరలను మరింత పెంచే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతున్నందున వినియోగదారులు కొనుగోలు సమయాన్ని జాగ్రత్తగా నిర్ణయించుకోవడం అవసరం. ధన త్రయోదశి రోజున బంగారం కొనుగోలు శుభమని నమ్మకం ఉండటంతో ప్రజలు పెద్దఎత్తున జ్యువెలరీ షాపులను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ పరిస్థితులను గమనించి, సరైన సమయాన్ని ఎంచుకోవడం వల్ల వినియోగదారులు లాభదాయకంగా కొనుగోలు చేయగలరని నిపుణుల సలహా.