Site icon HashtagU Telugu

Kodi Kathi Srinu : కోడి కత్తి శ్రీనుకు బెయిలివ్వండి.. అత్యవసర పిటిషన్

Kodi Kathi Srinu

Kodi Kathi Srinu

Kodi Kathi Srinu :  కోడికత్తి శ్రీను బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఇంకో అత్యవసర పిటిషన్ దాఖలైంది.  సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ ఈ పిటిషన్ వేశారు. దీన్ని వెంటనే విచారణ చేయాలని  కోర్టును కోరారు. గత ఐదురోజులుగా జరుగుతున్న పరిణామాలను న్యాయస్థానానికి మహేష్ వివరించారు.  కోడికత్తి శ్రీను  ఐదేళ్ల నుంచి బెయిల్ లేకుండా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలంటూ కోడికత్తి శ్రీను  తల్లి, సోదరుడు నిరవధిక దీక్షలు చేసిన విషయాన్ని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. మంగళవారం జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం(Kodi Kathi Srinu) దీన్ని విచారించనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. విజయవాడలో సావిత్రమ్మ, సుబ్బరాజు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి.. వారిద్దరినీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరు  శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వైద్యానికి నో చెప్పి,  ఆసుపత్రిలో కూడా దీక్షను కొనసాగించారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు వెళ్లి పరామర్శించారు. న్యాయపోరాటం చేద్దామని, దీక్ష విరమించాలని కోరారు.

Also Read: WhatsApp Feature : యాపిల్, ఆండ్రాయిడ్‌‌కు పోటీగా వాట్సాప్ కొత్త ఫీచర్

ఆదివారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ హర్షకుమార్‌ తదితరులు సావిత్రమ్మ, సుబ్బరాజులకు ఓఆర్‌ఎస్‌ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. శ్రీను దాదాపు ఐదేళ్లగా జైలులో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు దళితులంటే ముఖ్యమంత్రికి ఎందుకంత కోపమో అర్థం కావడం లేదన్నారు. ఈ నెల 24న దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు: మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు 

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడి కత్తి శ్రీను తల్లిని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు చేసిన వారు 3 నెలల్లో బయటకు వస్తున్నారని నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. కోడి కత్తి శ్రీనులా దేశంలో మరెవరికీ శిక్ష పడినట్లు లేదని వాపోయారు. జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావటం లేదని దుయ్యబట్టారు. జగన్ బాబాయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు బయట తిరుగుతున్నారని ఆక్షేపించారు. కోర్టుకి వెళ్లి జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదని నిలదీశారు. వెంటనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పి కోడి కతి శ్రీనుని బయటకు తీసుకురావాలని ఆనంద్ ​బాబు డిమాండ్ చేశారు.