Police Vs Students : అనంత‌పురంలో తీవ్ర ఉద్రిక్త‌త‌… స్టూడెంట్స్ పై పోలీసుల జులం

ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు విలీనం చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని విద్యార్థులు,విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో వైజాగ్‌లో చిన్న పిల్ల‌లు త‌మ స్కూల్‌ని విలీనం చేయ‌వ‌ద్ద‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు.

  • Written By:
  • Publish Date - November 8, 2021 / 04:28 PM IST

ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు విలీనం చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని విద్యార్థులు,విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో వైజాగ్‌లో చిన్న పిల్ల‌లు త‌మ స్కూల్‌ని విలీనం చేయ‌వ‌ద్ద‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. తాజ‌గా అనంత‌పురంలోని సాయిబాబా నేష‌న‌ల్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు.త‌మ క‌ళాశాల‌ను విలీనం చేసేందుకు యాజ‌మాన్యం అంగీక‌రించ‌డంతో దీనికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళ‌న చేశారు.

ప్ర‌వేట్ ప‌రం చేస్తే అధిక ఫీజులు క‌ట్టాల‌ని త‌మ‌కు అంత స్తోమ‌త లేద‌ని విద్యార్థులు వాపోయారు. అయితే ఈ ఆందోళ‌న చేస్తున్న‌ విద్యార్థుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యాజమాన్యం నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ మద్దతుతో సుమారు 500 మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌బిఎన్ కళాశాల ప్రధాన గేటు వద్ద గుమిగూడారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయ‌గా…నవ్య అనే విద్యార్థిని తల ప‌గిలి తీవ్ర ర‌క్త‌స్రావం అయింది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సలో భాగంగా తలపై నాలుగు కుట్లు వేసి సురక్షితంగా ఇంటికి పంపించారు.

III టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డప్ప శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో లాఠీచార్జికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న కొందరు మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకున్నారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 24న ఎయిడెడ్ కాలేజీలు తమ ఎయిడెడ్ పోస్టులను సరెండర్ చేసి గుర్తింపు రద్దు చేసి ప్రైవేట్ కాలేజీలుగా కొనసాగించేందుకు అవకాశం కల్పించింది.