New PCC Chief : ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రుద్రరాజు రాజీనామా.. ఎల్లుండిలోగా షర్మిలకు పార్టీ పగ్గాలు ?

New PCC Chief :  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు  రాజీనామా చేశారు.

  • Written By:
  • Updated On - January 15, 2024 / 03:07 PM IST

New PCC Chief :  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు  రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ  అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే ఛాన్స్ ఉంది. నిన్న (ఆదివారం) మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్  హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని పెట్టిన వైఎస్ షర్మిల.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతకుముందే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలను కలిసిన వైఎస్ షర్మిల.. పార్టీ విలీనం దిశగా చర్చలు జరిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు హైకమాండ్. అయితే ఇప్పటివరకు తెలంగాణలో యాక్టివ్ గా పాలిటిక్స్‌లో ఉన్న షర్మిల(New PCC Chief).. తిరిగి మళ్లీ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను ఆమెకు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రసుత్తం కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లిన షర్మిల.. ఆహ్వాన పత్రికను ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలను అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రస్తుతానికి పార్టీ కార్యకర్తను మాత్రమే అని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యమని, అందుకోసం నిబద్ధతతో పని చేస్తానని పునరుద్ఘాటించారు.

Also Read: Maldives – Indian Army : మాల్దీవులలో భారత ఆర్మీ ఎందుకు ఉంది ? ‘ఆపరేషన్‌ కాక్టస్‌’ ఏమిటి ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతోపాటు వైఎస్ షర్మిల కూడా భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మణిపూర్ వెళ్లారు. అక్కడ ఆమెకు అగ్రనేతలు కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. సంక్రాంతి తర్వాత ఆమెకు ఏపీపీసీసీ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. అయితే, 17వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందే షర్మిల పీసీసీ పగ్గాలు తీసుకునే అవకాశం ఉంది.