Ghanta Srinivas:`గంటా`సిత్రం..భ‌ళారే విచిత్రం!

మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఎప్పుడూ ఒకేపార్టీని నమ్ముకునే ఉండే ర‌కం కాదు. గెలిచే అవ‌కాశం ఉన్న పార్టీ వైపు వెళుతుంటార‌ని ఆయ‌న‌పై ప్ర‌త్యేక‌మైన ముద్ర ఉంది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా మాత్రమే రాజ‌కీయ అడుగులు వేస్తుంటారు.

  • Written By:
  • Updated On - May 6, 2022 / 02:30 PM IST

మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఎప్పుడూ ఒకేపార్టీని నమ్ముకునే ఉండే ర‌కం కాదు. గెలిచే అవ‌కాశం ఉన్న పార్టీ వైపు వెళుతుంటార‌ని ఆయ‌న‌పై ప్ర‌త్యేక‌మైన ముద్ర ఉంది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా మాత్రమే రాజ‌కీయ అడుగులు వేస్తుంటారు. అప్పటి వ‌ర‌కు సొంత వ్యాపారాలు చూసుకుంటారు. ప్రైవేటు జీవితానికి ప్రాధాన్యం ఇస్తుంటారని ఆయ‌న అనుచ‌రులు చెప్పుకుంటారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల సీజ‌న్ ప్రారంభం అయింద‌ని భావించారు కాబోలు, చంద్ర‌బాబు విశాఖ కార్య‌క్ర‌మంలో త‌ళుక్కున మెరిశారు గంటా శ్రీనివాస‌రావు.

గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయ ప్ర‌స్థానం తీసుకుంటే 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలిసారిగా అన‌కాప‌ల్లి లోక్ స‌భ టీడీపీ ఎంపీగా గెలుపొందారు. విశాఖ జిల్లా చోడ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004 ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా విజ‌యాన్ని అందుకున్నారు. ఆ త‌రువాత 2009 ఎన్నిక‌ల నాటికి ప్ర‌జారాజ్యం పార్టీ గూటికి చేరారు. ఆ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ప్ర‌జారాజ్యం త‌ర‌పున ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జారాజ్యం విలీనం అయిన త‌రువాత గంటా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తొలిసారి కిర‌ణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో తిరిగి టీడీపీ గూటికి చేరి భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్ర‌బాబు క్యాబినెట్ లో మంత్రిగా ప‌నిచేశారు. 2019 ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం నార్త్ నుంచి పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, రెండేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పంచ‌న చేర‌డానికి 2019 ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ప్ర‌య‌త్న చేశార‌ని అప్ప‌ట్లో బ‌ల‌మైన టాక్ గంటాపై వ‌చ్చింది. వైసీపీలోకి చేర‌బోతున్నార‌ని మీడియా దుమ్మురేపింది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయ‌డానికి గంటా శ్రీనివాస‌రావు సిద్ధ‌ప‌డ్డారు. తొలుత పార్టీకి రాజీనామా చేయ‌డంతో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. ఆ త‌రువాత పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు చంద్ర‌బాబునాయుడికి లేఖ‌ను కూడా రాశారు. రెండేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్న‌ ఆయ‌న వైసీపీ గూటికి చేర‌తార‌ని బ‌లంగా అనుచ‌ర‌గ‌ణం విశ్వ‌సించింది. తాజాగా జ‌న‌సేన పార్టీలో చేర‌డానికి సిద్ద‌ప‌డ్డార‌ని ప్ర‌చారం ఊపందుకుంది. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన గంటా శ్రీనివాస‌రావు మెగా ఫ్యామిలీకి స‌మీపంగా మెలుగుతుంటారు. ఆ సాన్నిహిత్యంతోనే ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు జ‌న‌సేన పార్టీలోకి వెళ‌తార‌ని టాక్ ఉంది. బ్యాంకును మోసం చేసిన కేసులు గంటా శ్రీనివాస‌రావు మీద ఉన్నాయి. ఆయ‌న కోసం పోలీసులు వెంటాడిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. ఒక వైపు వైసీపీతో లైజ‌నింగ్ చేస్తూనే మ‌రో వైపు భవిష్య‌త్ రాజ‌కీయ అడుగులు వేస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా న‌డుస్తోన్న టాక్‌. అందుకే, గంటా శ్రీనివాస‌రావు జ‌న‌సేన పార్టీ లోకి వెళ‌తార‌ని ఆయ‌న అనుచ‌రుల్లో చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు, కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఒక కొత్త పార్టీ ఆవ‌శ్య‌క‌త‌పై ఇటీవ‌ల హైద‌రాబాద్ లో స‌మావేశమైన వాళ్ల‌లో ఆయ‌న ప్ర‌మేయం కూడా ఉంది. కాపు లీడ‌ర్లుగా వివిధ పార్టీల్లో ఫోక‌స్ అయిన మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌దిత‌రులు ఆ సామాజిక‌వ‌ర్గం నేతృత్వంలో ఒక పార్టీ ఉండాల‌ని మీటింగ్ పెట్టుకున్నారు. రాజ్యాధికారం కోసం ఈసారి సీరియ‌స్ గా అడుగులు వేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న గంటా శ్రీనివాస‌రావు జ‌న‌సేన ఆప్ష‌న్ పై క‌న్నేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆక‌స్మాత్తుగా గురువారం విశాఖ జిల్లాలో చంద్ర‌బాబు పాల్గొన్న `బాదుడే బాదుడు` కార్య‌క్ర‌మానికి గంటా శ్రీనివాస‌రావు హాజ‌రు అయ్యారు. ఆయ‌న అనుచరులు పెద్ద‌గా హాజ‌రు కాన‌ప్ప‌టికీ గంటా మాత్రం చంద్ర‌బాబు వెంట రెండేళ్ల త‌రువాత క‌నిపించారు. ఇప్పుడే ఇదే టీడీపీలోనూ, ఉత్త‌రాంధ్ర‌లోనూ హాట్ టాపిక్ అయింది. విశాఖ జిల్లా టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశాల‌కు సైతం ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు దూరంగా ఉన్నారు. అంతేకాదు, మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా పార్టీ తీసుకున్న నిర్ణ‌యాన్ని కూడా వ్య‌తిరేకించారు. ఇలాంటి వైరుధ్యమైన ఆలోచ‌న‌లు ఉన్న గంటా శ్రీనివాస‌రావు మ‌ళ్లీ టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డం విశాఖ నార్త్ వాసుల‌కే అంత‌బ‌ట్ట‌డంలేదు. కేవ‌లం టీడీపీ త‌ర‌పున మాత్ర‌మే ఈసారి గెల‌వ‌గ‌ల‌మనే అంచ‌నాతో తిరిగి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారా? అనే టాక్ బ‌లంగా అనుచ‌రుల్లో వినిపిస్తోంది. కానీ, టీడీపీ అధిష్టానం ఆయ‌న ప‌ట్ల ఈసారి ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూడాలి.