Atmakur By Polls: ఆత్మ‌కూరు వైసీపీ అభ్య‌ర్ధిగా.. గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి..?

  • Written By:
  • Publish Date - March 31, 2022 / 10:42 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమెల్యే సీటు ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో అక్క‌డ ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ క్ర‌మంలో మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుంచే ఒకరిని జగన్ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుంది.. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు అనేది ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున‌ చర్చనీయాంశమవుతోంది.

అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. ఆత్మ‌కూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి రాజ‌కీయాల్లో ఉన్నా, ప్ర‌స్తుతం ఆయ‌న‌ వయసు మీద పడటంతో, రాజ‌మోహ‌న్ రెడ్డి పోటీ చేసేందుకు విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో గౌతంరెడ్డి స‌తీమ‌ణి శ్రీకీర్తి రెడ్డి వైపు, ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు స‌మాచారం. మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కూడా చిన్న వయసు కావడంతో శ్రీకీర్తి రెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై మేకపాటి కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి లోక్ సభ, బద్వేల్ అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నికలు జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాలు అప్పటికే అధికార వైసీపీ పార్టీ చేతిలో ఉన్నాయి, ఉప ఎన్నికల తర్వాత కూడా వైసీపీయే అక్కడ విజయం సాధించి, ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న ప‌ట్టును నిలుపుకుంది. అయితే తిరుపతి లోక్‌స‌భ ఎన్నిక‌లో మ‌త్రం సీఎం జ‌గ‌న్ సంప్రదాయానికి భిన్నంగా దివంగత నేత బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులకు కాకుండా, అసలు అక్క‌డ రాజకీయాలకు సంబంధం లేని డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మ‌రోవైపు బద్వేల్ ఉప ఎన్నిక విషయానికొస్తే దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య స్థానంలో ఆమె భార్య సుధకు అవకాశమిచ్చారు. ఎమ్మెల్యే స్థానంలో ఆయన భార్యకు అవకాశం ఇవ్వడంతో టీడీపీ పోటీనుంచి తప్పుకోగా, జనసేన ఎన్నికలకు దూరంగా ఉంది.బీజేపీ మాత్రం పట్టుబడ్డి అక్కడ పోటీ చేసి ఓడిపోయింది.

అయితే ఇప్పుడు ఆత్మకూరు విషయానికొస్తే ఇక్కడ దివంగత నేత గౌతమ్ రెడ్డి కుటుంబానికే టికెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. మొద‌ట గతంలో ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత, గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారాని, గౌతమ్ తనయుడిని బరిలో దింపుతారని, వీరెవరూ కాకుండా గౌతమ్ సోదరుల్లో ఒకరిని ఎంపిక చేసుకుంటార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారం రీత్యా పోటీ చేసే అవ‌కాశాలు లేవ‌ని దాదాపు తేలిపోయింది. ఇక గౌతమ్ రెడ్డి సోదరులిద్దరున్నా వారిద్ద‌రు ప్ర‌స్తుతం వ్యాపార రంగానికే ప‌రిమితం అయ్యేట్టున్నారు. మ‌రోవైపు గౌతం రెడ్డి త‌న‌యుడుకి వ‌య‌సు స‌రిపోదు. దీంతో చివరిగా గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తికే ఆత్మకూరు బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ‌ని వైసీపీ వ‌ర్గీయులు అంటున్నారు. ఇటీవ‌ల నెల్లూరులో సంతాప స‌భ‌కు హ‌జ‌రైన జ‌గ‌న్, శ్రీకీర్తి త‌ల‌పై చేయిపెట్టి ఆశీర్వ‌దించారు. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా శ్రీకీర్తిని ప‌రామ‌ర్శించారు. దీంతో శ్రీకీర్తి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ వర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఆత్మ‌కూరు అసెంబ్లీ అభ‌ర్ధి ఎవ‌ర‌నే దానిపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్ నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి.