Amaravati Centre: అమ‌రావ‌తిపై ఒట్టు! బీజేపీ, జ‌నసేన దూరం!!

అమ‌రావ‌తి కేంద్రంగా జ‌న‌సేన‌, బీజేపీకి మరోసారి బెడిసింది. `మ‌న అమ‌రావతి` పేరుతో రాజ‌ధాని గ్రామాల్లో బీజేపీ నేత‌లు ప‌ర్య‌టిస్తున్నారు. గ‌త వారం నుంచి బీజేపీ చీఫ్ వీర్రాజుతో పాటు ప‌లువురు ప‌ర్యటిస్తూ అమ‌రావ‌తి రైతుల‌కు భ‌రోసా ఇస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 3, 2022 / 12:57 PM IST

అమ‌రావ‌తి కేంద్రంగా జ‌న‌సేన‌, బీజేపీకి మరోసారి బెడిసింది. `మ‌న అమ‌రావతి` పేరుతో రాజ‌ధాని గ్రామాల్లో బీజేపీ నేత‌లు ప‌ర్య‌టిస్తున్నారు. గ‌త వారం నుంచి బీజేపీ చీఫ్ వీర్రాజుతో పాటు ప‌లువురు ప‌ర్యటిస్తూ అమ‌రావ‌తి రైతుల‌కు భ‌రోసా ఇస్తున్నారు. కానీ, జ‌న‌సేన క్యాడ‌ర్, లీడ‌ర్లు అక్క‌డ క‌నిపించ‌లేదు. అంటే బీజేపీ, జ‌న‌సేన పొత్తు దేవ‌తావ‌స్త్రంలా ఈ ప‌ర్య‌ట‌న ద్వారా అర్థం అవుతోంది.

2019 ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన త‌రువాత జ‌న‌సేన పార్టీని కాపాడుకునేందుకు బీజేపీతో ప‌వ‌న్ జ‌ట్టు క‌ట్టారు. అప్ప‌టి వ‌ర‌కు చేగువీరా, కాన్షీరాం, లెఫ్ట్ భావ‌జాలాన్ని వినిపించిన ఆయ‌న రైట్ కు మ‌ళ్లారు. హిందూవుల కోసం అండ‌గా ఉంటానంటూ స్టాండ్ మార్చేశారు. కొన్ని రోజులు బీజేపీతో క‌లిసి ప‌నిచేసే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మోడీ అపాయిట్మెంట్ లు కూడా ల‌భించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో తిరుప‌తి లోక్ స‌భ ఎన్నిక‌లు రావ‌డంతో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ప‌నిచేయ‌డం క‌నిపించింది.

Also Read:  Revanth Reddy Do or Die: రేవంత్ కు చావోరేవో!

తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అభ్య‌ర్థిని పెట్టే విష‌యంలో జ‌న‌సేన పార్టీని ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. బీజేపీ అభ్య‌ర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ ర‌త్న‌ప్ర‌భ‌ను ప్ర‌క‌టించ‌డంతో విధిలేని ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ప్ర‌చారం చేశారు. అయిన‌ప్ప‌టికీ డిపాజిట్లు కూడా రాక‌పోవ‌డంతో జ‌న‌సేన‌కు బ‌లంలేద‌ని తేలిపోయింది. ఆ త‌రువాత బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో బీజేపీ ఒంట‌రి పోరాటం చేసింది. తాజాగా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక బ‌రిలో కేవ‌లం బీజేపీ మాత్రమే క‌నిపించింది. అంతేకాదు, భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆహ్వానం ల‌భించింద‌ని జ‌న‌సేన చెబుతున్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ కు ప్ర‌త్యేకంగా ఎలాంటి ఆహ్వానం లేదు. పైగా చిరంజీవిని ఆ వేదిక‌పై హైలెట్ చేయ‌డం జ‌న‌సేన పార్టీని బీజేపీ ఏ విధంగా కార్న‌ర్ చేస్తుందో అర్థం అవుతోంది.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న తొలి రోజుల్లో విలీనం మాట ప‌వ‌న్ నుంచి వినిపించింది. పార్టీ విలీనం కోసం ఒక జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంద‌ని పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆయ‌న వ్య‌క్తం చేసిన విష‌యం స‌ర్వ‌త్రా తెలిసిందే. ఆ రోజు నుంచే జ‌న‌సేన మీద పెద్ద‌గా బీజేపీ కి గుడ్ విల్ లేద‌ని సంకేతాలు వ‌చ్చాయి. తాజాగా అమిత్ షాను, ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ పాల్ క‌లిసిన‌ప్పుడు ప‌వ‌న్ వెంట‌ప‌డుతున్నాడని షా చెప్పిన‌ట్టు పాల్ వెల్ల‌డించారు. జ‌న‌సేన‌తో పొత్తు లేద‌ని, ప‌వ‌న్ బీజేపీ వెంట‌ప‌డుతున్నాడ‌ని అమిత్ షా చెప్పిన‌ట్టు పాల్ మీడియాకు చెప్ప‌డం కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది.

Also Read:  Warangal Politics: వరంగల్ టీఆర్ఎస్ కు షాక్.. బీజేపిలోకి ఎర్రబెల్లి సోదరుడు?

రెండేళ్లుగా జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య న‌డుస్తోన్న రాజ‌కీయ అంత‌ర్గ‌త అంశాల‌ను తీసుకుంటే ఆ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని అర్థం అవుతుంది. దానికి తగిన విధంగా బీజేపీ ఒంటరిగా కార్య‌క్ర‌మాల‌ను చేసుకుంటోంది. తాజాగా అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌కు కూడా జ‌న‌సేన పార్టీని దూరంగా పెట్టింది. సో, ఆ రెండు పార్టీల మ‌ధ్య దాదాపుగా పొస‌గ‌డంలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్లాల‌ని జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. కానీ, టీడీపీ, బీజేపీ మాత్రం జ‌న‌సేన పార్టీని తాజాగా లైట్ గా తీసుకోవ‌డం కొస‌మెర‌పు.