Site icon HashtagU Telugu

Gannavaram: గన్నవరంలో ‘వైసీపీ’ గరంగరం!

Gannavaram

Gannavaram

టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి.. సొంత పార్టీ నుంచే విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్వయంగా వల్లభనేనే పార్టీలో ఉండమంటారా, వెళ్లిపొమ్మంటారా అన్నంత కాడికి పరిస్థితి వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. గన్నవరం రాజకీయాల్లో మంటకు కారణం దుట్టా రామచంద్రరావు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసింది ఈయనే. దుట్టా రామచంద్రరావును ఓడించిన వల్లభనేని వంశీ.. ఇప్పుడు అదే పార్టీలోకి వచ్చారు. దీంతో వల్లభనేని వంశీ అంటే దుట్టాకి ఓ పట్టాన నచ్చడం లేదు. ఆ మధ్య సీఎం జగన్.. వీరిద్దరి చేతులనూ కలిపినా.. ఇప్పుడైతే కలిసి పనిచేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ఆస్తులు రక్షించుకోడానికి, కేసుల నుంచి తప్పించుకోడానికే వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చారని వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు ఆరోపిస్తున్నారు.

గన్నవరంలో పరిస్థితులు చేజారుతుండడంతో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి.. ఈ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీపై పెద్ద కంప్లైంట్లే చేశారు. ఎక్కడా జగన్ అని గాని, జగన్ పథకాలు అని గాని ప్రచారం చేయకుండా.. తన అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత వల్లభనేని వంశీ అభిప్రాయం తీసుకున్నారు. ఆ సమయంలో సజ్జల, వల్లభనేని మధ్య హాట్ డిస్కషన్ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

గన్నవరం ఎమ్మెల్యేగా దుట్టా రామచంద్రరావు గెలుస్తారనే నమ్మకం గనక వైసీపీ అధిష్టానానికి ఉంటే.. తాను తప్పుకోడానికి సిద్ధంగా ఉన్నానంటూ వల్లభనేని వంశీ సజ్జలకు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే.. తన మద్దతు లేనిదే గన్నవరంలో ఎవరూ గెలవలేరని, గెలుపు అంటూ ఉంటే అది తనతోనేనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారని మాట్లాడుకుంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య తగువును తీర్చకుండానే సజ్జల మధ్యలో వెళ్లిపోయారని టాక్. దీంతో గన్నవరం పంచాయితీ రానురాను ఏ మలుపు తీసుకుంటుందోనని వైసీపీలోనే పెద్ద చర్చ జరుగుతోంది.