Ganja: ఆప‌రేష‌న్ “ప‌రివ‌ర్త‌న” …వేల ఎక‌రాల్లో గంజాయి పంట ధ్వంసం

స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విశాఖ జిల్లా పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా చేపట్టిన పరివర్తన కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. విశాఖ‌ప‌ట్నం ఏజెన్సీలో ఇప్ప‌టివ‌ర‌కు 5,500 ఎక‌రాల్లో గంజాయి పంట‌ను అధికారులు ధ్వంసం చేశారు.

  • Written By:
  • Updated On - November 28, 2021 / 12:27 PM IST

స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విశాఖ జిల్లా పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా చేపట్టిన పరివర్తన కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. విశాఖ‌ప‌ట్నం ఏజెన్సీలో ఇప్ప‌టివ‌ర‌కు 5,500 ఎక‌రాల్లో గంజాయి పంట‌ను అధికారులు ధ్వంసం చేశారు. జి.మాడుగుల, పెదబయలుతో పాటు మొత్తం ఎనిమిది మండలాల్లో గంజాయి పంట‌ని ధ్వంసం చేసిన‌ట్లు ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ సతీష్‌కుమార్ తెలిపారు. సాగు చేసిన పంటను రైతులు స్వచ్ఛందంగా ధ్వంసం చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కొన్ని గ్రామాల్లో గంజాయి పంట‌ను ధ్వంసం చేయ‌డాన్ని రైతులు అంగీక‌రించ‌డం లేద‌ని…క్ర‌మేపి వారిలో కూడా ప‌రివ‌ర్త‌న క‌లిగించి రైతుల‌ను ఒప్పించ‌గ‌లుగుతున్నామ‌ని తెలిపారు. రైతుల‌కు ప్ర‌త్యామ్నాయ జీవ‌నోపాధి ప్రారంభంలో కొంత క‌ష్టాల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని..వారికి ఆ పంట‌లపై అవ‌గాహ‌న క‌ల్పించి అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలపై గిరిజనులతో చర్చిస్తున్నామ‌ని… తీపి నారింజ, జామ, అల్లం, పసుపు, మిరియాలు వంటి వాణిజ్య పంటల గురించి వారు అడుగుతున్నారని ఎస్ఈబీ జాయింట్ డైరెక్ట‌ర్ సతీష్ తెలిపారు. వాటిని జిల్లా యంత్రాంగం, ఉద్యానవన, వ్యవసాయ శాఖలతో కలిసి స‌మ‌న్వ‌యం చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

10,000 ఎకరాలకు పైగా గంజాయి సాగు చేయగా..ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 5,500 ఎక‌రాల్లో పంట‌ను ధ్వంసం చేసిన‌ట్లు పేర్కోన్నారు. మావోయిస్ట్ ప్రభావిత కటాఫ్ ఏరియాకు తాము సగం దూరంలో ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఏజెన్సీలో గంజాయి సాగు విపరీతంగా ఉందని… ఆర్థికసాయం వందల కోట్లకు చేరుతుందని చెప్పారు. తమిళనాడు, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన స్మగ్లర్లు, ఫైనాన్షియర్లను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు.