Site icon HashtagU Telugu

Jagan Govt Prog: వైసీపీకి ‘గడప’ గండం.. వ్యతిరేకత పెరుగుతోందన్న భయం!

Gadapa Gadapa ku Mana Prabhutvam roja

జగన్ బొమ్మ చూసి 151 సీట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని గెలిపించారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆ జగన్ బొమ్మ ఎందుకు వారికి కలిసిరావడం లేదు? అధికారంలోకి వచ్చిన తరువాత.. మూడేళ్లు గడిచాక తొలిసారిగా ప్రజల గడప తొక్కింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో అడుగు వేసింది. కానీ అదే గడప గడపలో వారికి నిరసన సెగ తప్పడం లేదు. అసలెందుకీ పరిస్థితి వచ్చింది? ఇచ్చిన హామీల్లో మెజార్టీ వాటిని నెరవేర్చేశాం అని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించామంటోంది. మరి ఎందుకు ప్రజల నుంచి నిరసన వస్తోంది? చివరకు ప్రజా ప్రతినిధులు ఏదో తూతూమంత్రంగా జనంలోకి వెళుతున్నారా? కొంతమందయితే అసలీ ప్రోగ్రామ్ నే తమ ప్రాంతాల్లో స్టార్ట్ చేయలేదా?

జనంలోకి వెళ్లాలంటే నిరసన జ్వాలలు.. వెళ్లకపోతే అధిష్టానం ఆగ్రహ జ్వాలలు.. ఇదెక్కడి పితలాటకం రా బాబూ అన్నట్టుంది వైసీపీ నేతల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికీ వెళ్లి.. ప్రభుత్వ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను వివరించమంటే.. దానికి ప్రజా ప్రతినిధులు, ప్రజా నాయకులు వెనకడుగు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గత మూడేళ్లలో కరెంటు ఛార్జీలు పెంచేశారు. తాగునీటికి కటకట తప్పడం లేదు. ఇక రోడ్ల సంగతి వేరే చెప్పక్కరలేదు. నిజానికి ఈ పథకానికి తొలుత పెట్టిన పేరు గడప గడపకూ వైసీపీ. కానీ ఇలాంటి పేరు పెడితే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోకూడదు. అందుకే గడప గడపకూ మన ప్రభుత్వం అని పేరు మార్చింది. అయినా అది పార్టీకి, ప్రభుత్వానికి కలిసి రావడం లేదన్న వాదనుంది.

ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు ఏడాదిలోగా కూడా రావచ్చు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల హింట్ ఇవ్వడంతో రాజకీయ పార్టీలు మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈలోగా అధికారికంగా ఉన్న సదుపాయంతో జనం దృష్టిలో మార్కులు కొట్టేయాలని వైసీపీ సర్కారు ప్రయత్నించినా అది దానికి సాధ్యం కావడం లేదు. అందుకే ఏదో వెళ్లామంటే వెళ్లాంలే అని తూతూమంత్రంగా కానిస్తున్నారు.. ఎక్కడైనా ప్రజావ్యతిరేకత కనిపిస్తే.. వెంటనే అక్కడ తమ ప్రోగ్రామ్ కు స్వస్తి పలికి.. మరో ఏరియాకు వెళ్లిపోతున్నారు. పన్నులను అధికంగా పెంచడంతో అది ప్రజలకు ఇబ్బందిగా మారింది. అందుకే ఇలాంటి సమస్యలపై నాయకులను నిలదీస్తున్నారు.

టీడీపీ హయాంలో రూ.200 పింఛను రెండు దశల్లో రూ.2000కు పెరిగింది. కానీ వైసీపీ సర్కారు తొలి రెండేళ్లు రూ.250 పెంచింది. ఇప్పుడు మొత్తంగా రూ.500 కు చేర్చింది. నాన్న బుడ్డీతో వచ్చిన ఆదాయంతోనే అమ్మఒడిని అమలు చేస్తున్నామని ప్రభుత్వమే డైరెక్ట్ గా చెప్పేసింది. దీనిని నిర్వహించడానికి విద్యారంగంలో అంతకుముందున్న పథకాలను రద్దు చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్, మెస్ ఛార్జీల చెల్లింపులకు పేర్లు మార్చింది. వాటికే విద్యా దీవెన, వసతి దీవెన అని కొత్త పేర్లు పెట్టింది. ఇక ఇళ్ల స్థలాల విషయానికి వస్తే.. కొన్నింటిని ఊరికి చివర్లో.. ఇళ్లు కట్టుకోవడానికి వీలులేని చోట ఇచ్చారంటూ ప్రజల్లో నిరసన సెగలు పెరిగాయి. దీంతో ఆ విషయాన్ని నేతలు గడప గడపలో ప్రస్తావించలేకపోతున్నారు.

ప్రభుత్వ పథకాలు సక్రంగా అమలు జరిగితే.. అసలు సర్కారుకు ఎలాంటి సమస్య ఉండదు. ఏ పబ్లిసిటీ చేయకపోయినా ప్రజలే నచ్చి, మెచ్చి ఓట్లేస్తారు. కానీ పాత పథకాలకు పేర్లు మార్చి.. కొత్తగా ఇచ్చినట్టు చూపించి.. వాటిని కూడా సక్రమంగా అమలు చేయకపోతే ఆటోమేటిగ్గా ఆ వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది. దీనివల్ల నష్టం మరింత పెరిగే ప్రమాదముందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా వైసీపీ ప్రభుత్వ పథకాల్లో లోపాలను ఆసరాగా చేసుకుని టీడీపీ.. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టింది. పైగా లెక్కలతో కూడిన పత్రాలను కూడా ప్రజలకు పంచుతోంది. దీనిని గమనించే.. వైసీపీ.. గడప గడపకూ అంటూ ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. అందుకే ఇప్పుడు ఏం చేయాలో ఆ పార్టీకి పాలుపోవడం లేదంటున్నారు విశ్లేషకులు.

Exit mobile version