YS Suneetha : వైఎస్ సునీత దారేది!

స్వ‌ర్గీయ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌కు అండ‌గా టీడీపీ సోష‌ల్ మీడియా నిలుస్తోంది

  • Written By:
  • Publish Date - February 21, 2022 / 04:55 PM IST

స్వ‌ర్గీయ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌కు అండ‌గా టీడీపీ సోష‌ల్ మీడియా నిలుస్తోంది. ఆమె చేస్తోన్న డిమాండ్లలోని న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను ప్ర‌స్తావిస్తోంది. రాబోవు రోజుల్లో ఆమె టీడీపీలో చేరుతున్నార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని ఒక కుట్ర‌గా భావిస్తోంది. సీబీఐ ద‌ర్యాప్తును ప‌క్కదోవ ప‌ట్టించ‌డానికి సునీత మీద టీడీపీ ముద్ర వేస్తున్నార‌ని ఆమె అభిమానుల అనుమానం. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు సునీత దూరంగా ఉంటోంది. ఆమె తండ్రి హ‌త్య‌కు కార‌ణ‌మైన వాళ్ల‌ను శిక్షించాల‌ని పోరాడుతోంది.వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ లో మంత్రి, ఎంపీగా కూడా చేశాడు. సోద‌రుడు వైఎస్సార్ ఆంధ్రా రాజకీయాలలో బిజీగా వుంటే, తమ్ముడిగా కడప రాజకీయాలు తానొక్కడే పులివెందుల నుండి చూసుకునే వాడు. కడపను కుటుంబ కంచుకోటలాగా మార్చింది వైఎస్ వివేకానందరెడ్డి. కానీ ఆయనకే ఎంపీ టికెట్టు ఇవ్వలేదు. తనకు ఇవ్వకున్నా పర్లేదు సోద‌రుడు కూతురు షర్మిలకు ఇచ్చినా పర్లేదని సంధికి వచ్చినట్లు ఆనాడు మీడియాలో వార్తలు. అదీ జరగలేదు.

గుండెపోటుతో ముగిసిపోయిన ఆయన కథలోని.. చివరి అంకంలో కూతురు సునీత మేల్కొంది. బంధువులు దగ్గరుండి చేసిన అంత్యక్రియలలో అనుమానాలు వున్నా అడ్డుచెప్పక, అడ్డురాక, మెలిత్రిప్పే బాధను గుండెలో దాచుకొని హుందాగా మెలిగింది.సోదరుడు అధికారం చేపట్టాక కూడా ఓపికగా రాష్ట్ర దర్యాప్తును గమనించి, తానే హైకోర్టుకు వెళ్లి సిబిఐ దర్యాప్తును అడిగింది.దాచేది ఏమీ లేకపోతే..ఎందుకు రాష్ట్రం తరపున తామే దర్యాప్తు చేస్తామని హైకోర్టులో అడ్డుచెప్పే అఫిడవిట్ వేయించారు అనే ప్ర‌శ్న వ‌స్తోంది. కోర్టు కూడా అన్నీ విచారించి, వివేక కుమార్తె వేదనను పరిగణించే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. నిజం నిప్పులాంటిది. దర్యాప్తులో వెళ్లడవుతున్న అంశాలు ప్ర‌కారం సూత్రధారుల గుండెలు కుబేల్ మ‌నేలా ఉన్నాయి. తననే కడతేర్చాలని రెక్కీ చేస్తున్నారని, కాపాడమని భద్రత ఇవ్వమని సునీత రక్షణ అడిగింది .వివేకానందరెడ్డి కుటుంబంలో మిగిలింది కూతురు, అల్లుడు. కడపను కంచుకోటగా చేసిన ఆ కుటుంబానికి వారసత్వంగా మిగిలిన వీరిని పిలిచి రాజ్యసభ ఇచ్చారా? ఎమ్మెల్సీ ఇచ్చారా? ఏమి చేశారు?వారి మీదే అనుమానాలు వున్నాయని, అమలుపరిచిన నిందితులు పసలేని రాజకీయ ఆరోపణలపై సునీత తిర‌గ‌బ‌డింది. ఇప్పుడు పగబట్టినట్లు టిడిపి తరపున టికెట్టు ఇవ్వబోతున్నారని, తాడేపల్లి సలహాదారుడు మొదటిసారిగా ఆరోపిస్తున్నారు.

ఆమె ఆ పదవులు అడిగారా? తన నాన్న మీద నిష్పక్షపాత దర్యాప్తు మాత్రమే కదా అడిగింది. ఆ అర్హత కూడా డాక్టర్ చదువులు చదివిన ఆ కూతురుకు లేదా? ఆ ప్రాథమిక హక్కును కూడా హరిస్తూ.. కేవలం ఒక పార్టీ టికెట్టు కోసం నాన్న మరణం మీద దర్యాప్తు అడిగినట్లు దగుల్బాజీ రాజకీయంతో బురద చల్లడం, ఒక్క వైకాపాకే చెల్లింద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. తమకోసం ప్రాణాలు పోయేవరకు అన్నీ దిగమింగుకొని, సర్దుకుపోతూ, కష్టపడిన బాబాయి కూతురు, కుటుంబ ఆడపడుచు మీద రాజకీయ ప్రచారంతో, ఉన్నారు. అవినాశ్ రెడ్డిని ఇరికించాలన్నా.. వదిలేయాలన్నా.. సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుని జరిగిన దర్యాప్తు మీద విచారణను చేసి కదా కోర్టు తీర్పు ఇస్తుంది. ముందే వైకాపా ఎందుకు తీర్పులు ఇస్తోంది. గుండెపోటు కాదని జనానికి అర్థమైనప్పుడు కూడా క్షణాల్లో చంద్రబాబు నాయుడు మరియు కడప జిల్లా నేతలే నేరస్తులు అని శవం దగ్గరే జగన్ రెడ్డి చేత తీర్పులు ఆనాడు ఇచ్చేశాడు. ఇప్పుడు ద‌ర్యాప్తును అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని స్వ‌యానా సోద‌రి సునీత చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను జ‌గ‌న్ పార్టీ నేత‌లు తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే టీడీపీలోకి సునీత అంటూ వైసీపీ సోష‌ల్ టీం ప్ర‌చారం చేస్తోంద‌ని టీడీపీ సోష‌ల్ మీడియా పోస్టుల సారాంశం. మొత్తం మీద డాక్ట‌ర్ సునీత ఇరు పార్టీల సోష‌ల్ మీడియా పోస్టుల‌తో న్యూస్ మేక‌ర్ గా మారింది.