Site icon HashtagU Telugu

TDP Mahanadu : మ‌హానాడు జోష్‌! లోకేష్ దూకుడు!!

Lokesh Law

Lokesh Mahanadu

తెలుగుదేశం పార్టీ ప‌గ్గాల‌ను లోకేష్ కు పూర్తి స్థాయిలో అప్ప‌గించ‌డానికి రంగం సిద్ధం అవుతోంది. ఆయ‌న నాయ‌క‌త్వంపై మ‌హానాడు వేదిక‌గా క్యాడ‌ర్, లీడ‌ర్ల నుంచి వ‌చ్చిన స్పంద‌న సానుకూలంగా ఉంద‌ని పార్టీ భావిస్తోంది. రాబోవు 40ఏళ్ల‌కు స‌రిప‌డా నాయ‌క‌త్వాన్ని తయారు చేసే బాధ్య‌త‌ను లోకేష్ కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఆయ‌న మ‌హానాడు వేదిక‌గా 2+1, మూడుసార్లు ఓడితే టిక్కెట్ లేద‌నే విధానాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. దీంతో సీనియ‌ర్ల‌కు వ‌ణుకుపుడుతోంది. ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా లోకేష్ నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని సీనియ‌ర్ల‌కు బాగా తెలుసు. ఆయ‌న మ‌దిలోని ఆలోచ‌న ఎలా అమ‌లు చేస్తాడో కూడా సీనియ‌ర్ల‌కు అనుభ‌వం ఉంది.

ప‌లు మార్గాల ద్వారా స‌ర్వే రిపోర్ట్ ల‌ను సిద్ధం చేసుకున్న లోకేష్ ఏడాది ముందుగానే టిక్కెట్ల‌ను ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. క‌నీసం 100 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ముందుగా ప్ర‌క‌టించ‌డం ద్వారా పార్టీలో జోష్ నింపాల‌ని చూస్తున్నారు. త్వ‌ర‌లో చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌, లోకేష్ పాద‌యాత్ర రూట్ మ్యాప్ లు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఆ పాద‌యాత్ర‌, బ‌స్సు యాత్ర‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డానికి జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టికే 175 అసెంబ్లీ స్థానాల‌కుగాను సుమారు 140 చోట్ల ఇంచార్జిలు ఉన్నారు. ఇంకా సుమారుగా 35 చోట్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌ను నియ‌మించాలి. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు కూడా ముగిసింద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంచార్జిల పనితీరును బేరీజు వేయ‌డం ద్వారా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తారు. ప్ర‌స్తుతం బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని టీడీపీ నిర్వ‌హిస్తోంది. దాన్లో పనిచేసిన వారి సామ‌ర్థాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేయ‌డానికి లోకేస్ టీమ్ సిద్ధం అవుతోంద‌ని స‌మాచారం.

వ‌రుస‌గా మూడుసార్లు పోటీచేసి ఓట‌మిపాలైన‌వారికి ఈ సారి ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇచ్చేది లేద‌ని లోకేష్‌ ప్ర‌క‌టించ‌డంతో సీనియ‌ర్ల‌లో గుబులు మొద‌లైంది. అంతేకాకుండా 40 శాతం సీట్లు యువ‌త‌కే కేటాయించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సీనియ‌ర్లు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించాలనుకున్నా ప్ర‌జ‌ల‌తో ఉండే వాళ్ల‌కు మాత్ర‌మే సీట్లు ల‌భిస్తాయ‌ని లోకేష్ స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. చాలా మంది వార‌సులు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నారు. కేవ‌లం కుటుంబం వార‌స‌త్వంతో టిక్కెట్ల వ‌స్తాయ‌ని భావిస్తోన్న వాళ్ల‌కు లోకేష్ సంకేతం షాక్ ఇస్తోంది. డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కేఈ సోద‌రులు పార్టీలో ప‌నిచేయ‌కుండా, ఆర్థికంగా ఆస‌రా అందించ‌కుండా అంటీ ముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఉద్దేశంతోనే సుబ్బారెడ్డికి టీడీపీ సీటును చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇలాంటి సాహ‌సోపేత నిర్ణ‌యాలు ఇంకా ఉంటాయ‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంతో కేఈ సోద‌రుల‌కు షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోయిన నేత‌లు కొంద‌రు ఉన్నారు. వాళ్ల‌కు ఈ సారి సీటు లేద‌ని స్ప‌ష్ట‌మైంది. సీటు రాలేద‌ని పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్య‌ర్థుల‌కు స‌హ‌క‌రిస్తామ‌న్నా, సీటిచ్చేది మాత్రం లేద‌ని లోకేష్ భావిస్తున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌హానాడులో తెలంగాణ నేత‌లతో స‌హా లోకేష్‌తో మాట్లాడ‌టానికి ఎక్కువ స‌మ‌యం వెచ్చించ‌డాన్ని బ‌ట్టి చూస్తే యాక్టింగ్ ప్రెసిడెంట్ గా రాబోవు రోజుల్లో ఉంటార‌ని పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీని బ‌లోపేతం చేయాలంటే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని లోకేష్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌న ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు పంచుకోవాల‌నంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే బాగుంటుంద‌ని ఆయ‌న అభిప్రాయమ‌ట‌. సీనియ‌ర్ల‌తో మ‌నోభావాలు పంచుకున్న‌ప్ప‌టికీ అనుభవంలేని లీడ‌ర్‌గా కొంద‌రు సీనియ‌ర్లు భావించ‌డం ఆయ‌న‌కు ఏ మాత్రం న‌చ్చ‌డంలేద‌ని ఆయ‌న కోట‌రీలోని టాక్‌. అందుకే, ఏజ్ గ్రూప్ వారు, సీనియ‌ర్ల వార‌సులు, యువ‌త‌ను రంగంలోకి దింపాల‌ని ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న వైసీపీకి యూత్ కావాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

సంస్థాగ‌త మార్పుల‌ను త‌న ప‌ద‌వి నుంచే తీసుకురావాల‌ని లోకేష్ అనుకుంటున్నార‌ట‌. ప్రస్తుతం ఆయ‌న జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు . రెండుసార్లు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈసారి ఆ ప‌ద‌వికి దూరంగా ఉండాల‌ని చూస్తున్నార‌ట‌. అందుకే 2+1 ఈక్వేష‌న్ ను ఆయ‌న ప‌రిచ‌య‌డం చేయ‌డానికి సిద్ధం అవుతున్నార‌ని తెలిసింది. అంటే, రెండుసార్లు వ‌రుస‌గా ఒకే ప‌ద‌విని నిర్వ‌హించిన వాళ్ల‌కు ఇక ఆ ప‌ద‌వి ఉండొద్ద‌ని ఆయ‌న ఈక్వేష‌న్‌. దాన్ని మ‌రింత ప‌దును పెట్ట‌డం ద్వారా సంస్థాగ‌త ప‌ద‌వులు నింపాల‌ని చూస్తున్నారు. బ‌హుశా ఈ ఈక్వేష‌న్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌కు అమ‌లు చేస్తే చాలా మంది సంస్థాగ‌త ప‌ద‌వుల‌కు దూరంగా ఉండాల్సిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో లోకేష్ ఆ ఫార్ములాను ఎలా అమ‌లు చేస్తారో చూడాలి.