AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మహిళలకు ఉపాధి కల్పించే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందించేందుకు, అలాగే టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా 2024-25 సంవత్సరానికి సంబంధించి దాదాపు లక్ష మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భాగంగా, అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలలో రెండు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. 10 రోజుల్లో శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి కాంట్రాక్టర్ ఎంపిక పూర్తయ్యింది. ఈ శిక్షణను బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలతో పాటు, ఎస్సీ వర్గానికి చెందిన మహిళలకు కూడా అందించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
YCP : జగన్ ను సంతోషపెట్టిన వారంతా ఊచలు లెక్క పెట్టాల్సిందేనా..?
పథకాన్ని మొదట 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఒక్కో నియోజకవర్గంలో 2,000 నుంచి 3,000 మంది అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు అందజేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఎక్కువ దరఖాస్తులు వస్తే, వాటిని స్క్రూటీని చేసి, తదుపరి విడతలలో పరిగణలోకి తీసుకుంటారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం 2014-2019 కాలంలో అమలు చేసిన ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల, ఈసారి పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. గడచిన కాలంలో శిక్షణ కేంద్రాలు కేవలం జిల్లాస్థాయి మీద ఉండగా, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో కనీసం 70 శాతం హాజరు ఉన్న మహిళలకు మాత్రమే ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఇక, శిక్షణకు హాజరు నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను సైతం సిద్ధం చేశారు. ఈ పథకం మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా, ఆర్థికంగా స్వావలంబనం సాధించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.