Retrofitted Handicapped Motor Vehicles: కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు తీపికబురు అందించనుంది. వారికి 100 శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు) అందించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు నివేదించారు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
2024-25 సంవత్సరానికి, ప్రతి నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒక్కో వాహనం ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం వ్యయం రూ.17.50 కోట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి, నాలుగు నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వాహనాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
త్రిచక్ర వాహనాల పంపిణీకి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. వైకాపా ప్రభుత్వం తన హయాంలో ఒక్కసారే పంపిణీ చేసింది. 4,000 మంది దరఖాస్తు చేసుకుంటే, వైకాపా నేతలు సిఫారసు చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, 1,750 మందికి మాత్రమే అందించారు. ఎన్నికల ముందు మళ్లీ జిమ్మిక్కులు చేస్తూ, ఇవ్వకపోయారు. కానీ కూటమి ప్రభుత్వానికి వచ్చిన మొదటి ఏడాది నుంచే దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ ఏడాది 1,750 మందికి త్రిచక్ర వాహనాలు అందించడంతోపాటు, ప్రతీ ఏడాదీ ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.
త్రిచక్ర వాహనాల పంపిణీకి దివ్యాంగుల అర్హతలను ప్రభుత్వం నిర్ధారించింది. డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు, కనీసం ఒక సంవత్సరం స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులుగా పరిగణించబడతారు. 18-45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి ఈ త్రిచక్ర వాహనాలు అందించబడతాయి. వారి ఆదాయ పరిమితి రూ.3 లక్షలలోపు ఉండాలి.