ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం సంక్రాంతి పర్వదినం నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఈ శుభవార్తను ప్రకటించారు. “సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి మొదలు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం” అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Yarlagadda Venkatrao’s Post
ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు:
- ఆర్థిక భారం తగ్గుదల: మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి.
- స్వేచ్ఛా ప్రయాణం: మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు.
- సాధికారత: మహిళల సామాజిక, ఆర్థిక సాధికారతకు ఈ పథకం దోహదపడుతుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూటమి హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కీలకమైనది. ఈ పథకంపై పరిశీలన జరపడానికి ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు పంపించింది. అక్కడ అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేసి, సంబంధిత నివేదికను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
అయితే, తెలంగాణ, కర్ణాటకలో అమలుచేస్తున్న విధానాన్ని ఏపీలో కూడా అమలు చేస్తే, ఏపీఎస్‌ఆర్టీసీపై నెలకు రూ.250 కోట్ల భారం పడే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికీ, ఈ పథకం అమలులో వస్తున్న కీలక ప్రశ్నలు ఇవి? ముఖ్యంగా, ఉచిత ప్రయాణం ఎలాంటి సర్వీసులకు వర్తిస్తుందో, ఎన్ని రూట్లలో దీన్ని అమలు చేయాలో, అలాగే కొత్త జిల్లాల పరిధిలోనే ఈ పథకం పరిమితమవుతుందో లేక పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆవశ్యకత ఉంటుందో అనే అంశాలపై అధికారుల దృష్టి కేంద్రితమై ఉంది. ఏపీ రాష్ట్రంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో, ఈ అన్ని సర్వీసులలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడానికి కొన్ని ప్రాక్టికల్ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ పధకం అమలు అయితే ప్రభుత్వ బస్సుల్లో రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు, అదనంగా బస్సులు కొనుగోలు చేసి, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అందుకే, ఈ పథకాన్ని అమలు చేయడానికి సరిపడా సౌకర్యాలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అధికారుల అభిప్రాయం. ఈ నేపధ్యంలో, ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం, ఈ పథకాన్ని సంక్రాంతి తరువాత అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో, ఈ పథకం ప్రారంభానికి సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు సంభవిస్తున్నాయి.