Free Admissions : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1) (ఈ) ప్రకారం విద్యార్థులకు ఈ ఉచిత అడ్మిషన్లు కల్పించనున్నారు. అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు తమ పేర్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 1న అడ్మిషన్లకు ఎంపికైన విద్యార్థుల మొదటి విడత జాబితాను విడుదల చేస్తారు. ఏప్రిల్ 15న రెండో విడత జాబితా రిలీజ్ అవుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు కల్పించనున్నారు. ఎంపికైన పిల్లలకు ప్రభుత్వమే ఫీజులను చెల్లిస్తుంది. ఇందులో అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు(Free Admissions) 6 శాతం సీట్లను కేటాయించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join
ఏపీ గిరిజన గురుకులాల్లో..
- 7 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 8వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
- అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 25 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను మార్చి 30న విడుదల చేస్తారు.
- ఏప్రిల్ 7న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా.. మే 5న మెరిట్ జాబితా విడుదలచేసి మే 20, 25 తేదీల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
- ఏపీలోని 31 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన బాలబాలికలు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.
Also Read :Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. మార్చి 25న విచారణకు పిలుపు
బీసీ గురుకులాల్లో ప్రవేశాలు
విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ రిలీజైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.