బుధువారం అనకాపల్లిలోని అచ్యుతాపురం (Atchutapuram ) ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన (Reactor Explosion) ఘటన తెలిసిందే. ఈ ఘటన గురించి అంత మాట్లాడుకుంటుండగానే మరో ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి మరో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే వెళ్లాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు ఝార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు. 6 కిలోలీటర్ల రియాక్టర్‌లో కెమికల్ నింపి ఛార్జింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్‌హోల్ నుంచి రసాయనం ఉప్పొంగి పైకప్పుకు తగిలి కార్మికులపై పడింది. దీంతో గాయపడిన కార్మికులను హుటాహుటిన విశాఖలోని ఇండస్ ఆస్పత్రికి తరలించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. అనకాపల్లిలోని (Anakapalli) ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఆస్పత్రిలో వారికి అందుతున్న వైద్య సేవలపై జగన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షల చొప్పున అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
ఇదిలా ఉంటె పరిశ్రమల్లో వరస ప్రమాదాలు కార్మికులు, స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జనావాసాల మధ్య ఏర్పాటైన పరవాడ జేఎన్ ఫార్మాసిటీతో పాటు అచ్యుతాపురం సెజ్‌లో కలిపి 138 ఫార్మా పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 40 వేల మంది పని చేస్తున్నారు. మండే స్వభావం గల సంస్థల్లో అధికారులు తనిఖీలు సరిగ్గా చేపట్టకపోవడంతో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Fruits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పండ్లను తినాల్సిందే!