Site icon HashtagU Telugu

Fire At Pharma Unit: ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురి సజీవదహనం

4 killed In Fire

Fire

అనకాపల్లి జిల్లా పరవాడ (Parawada)లో ఉన్న జేఎన్‌ ఫార్మసీలోని ఓ ఫార్మాస్యూటికల్‌ యూనిట్‌లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి (Four persons died) చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావుగా గుర్తించారు. మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లారస్ యూనిట్ 3లో షార్ట్ సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

పరవాడ పోలీసుల ప్రకారం.. యూనిట్ లారస్ ల్యాబ్స్‌గా గుర్తించబడింది. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు ధృవీకరించని నివేదికలు అందాయి. వారి మృతదేహాలు కింగ్ జార్జ్ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నాయి. షీలానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ అధికారుల నుంచి పోలీసులకు ఇంకా అధికారిక సమాచారం రాలేదన్నారు. కాగా.. సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు ఫార్మాసిటీ కార్మికులు, సీఐటీయూ నాయకుడు సత్యనారాయణ ధ్రువీకరించారు. యూనిట్‌లో భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. గడిచిన ఏడాది కాలంగా పరవాడ ఫార్మా సిటీలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తమకు రక్షణ లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఫార్మా సిటీలో ఇలాంటి ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయని కార్మికులు ఆరోపించారు.

Also Read: Vizag kapu : కాపునాడుకు వైసీపీ డుమ్మా, 5శాతం రిజ‌ర్వేజ‌న్ పై జ‌గ‌డం

పవన్ దిగ్భ్రాంతి

అనకాపల్లిలోని పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై జనసేనాని పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫార్మా సంస్థలో చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించడం దురదృష్టకరమన్నారు. ఆ కుటుంబాలకు న్యాయబద్ధమైన ఆర్థికపరిహారం ఇవ్వాలని, అన్నివిధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. క్షతగాత్రులైన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ సూచించారు.