Janasena: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేడు జనసేనలో చేరనున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన పెండెం దొరబాబు మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో ఆయన మౌనంగా ఉన్నారు. అయితే పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపునకు కృషి చేశారని చెబుతారు. ఎన్నికల ఫలితాలు వచ్చినతర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అయితే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Read Also: Women’s Day 2025 : రేపు ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం
ఈరోజు తనతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్, పిఠాపురం జడ్పీటీసీ సభ్యుడు బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, పిఠాపురం పురపాలక సంఘం వైస్ ఛైర్‌పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, మరికొందరు నేతలు, తన అనుచరులు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. పెండెం దొరబాబు బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 1999 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు. దొరబాబు 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.
ఇటీవల పెండెం దొరబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసిన తన చేరికపై క్లారిటీ తీసుకున్నారు. తనతో పాటు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. పెండెం దొరబాబును నేడు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించనున్నారు. దీంతో పిఠాపురంలో జనసేన మరింత బలోపేతం అయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది. పిఠాపురం నియోజకవర్గం రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే దొరబాబు చేరిక కీలక పరిణామంగా చెప్పొచ్చు.
Read Also: 26/11 Mumbai Attacks : తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానం